అన్ని మాఫియాలకు అడ్డా నీది…
Chennur Congress Leaders: ఎమ్మెల్యే వివేక్ ని విమర్శించే స్థాయి నీకు లేదు, అసలు నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకుని విమర్శించాలని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి పై చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూల రాజిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పని చేస్తాడని దుయ్యబట్టారు. ప్రజలకు న్యాయం చేద్దామని ఆలోచన ఆయనకు ఏ కోశాన లేదన్నారు. రాజిరెడ్డి ఇసుక మాఫియా, భూ దందాల మాఫియా, లిక్కర్ మాఫియా, బియ్యం మాఫియాలతో కుమ్మక్కై కోట్లు సంపాదించాలని కాంగ్రెస్ లోకి వచ్చాడన్నారు. అన్ని తానై రాజ్యాధికారాన్ని ఏలుదామని అనుకున్నాడని, కానీ ఎమ్మెల్యే అలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే వివేక్ అక్రమాలు, మాఫియాకు ఇక్కడ స్థానం లేదని తేల్చి చెప్పాడన్నారు. అక్రమ దందాలు చేస్తే కఠినంగా శిక్షించాలని అధికారులకు చెప్పాడని అన్నారు.
దీంతో తన అక్రమ దందాలు సాగడం లేదని మూల రాజిరెడ్డి ఎమ్మెల్యేపై అసహనంతో మతిస్థిమితం కోల్పోయి విమర్శలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. మరోసారి విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీ చరిత్ర అందరికి తెలుసు.. అవసరానికి వాడుకుని తర్వాత ఛీ కొట్టే సంప్రదాయం మీది… గతంలో మీ కుటుంబానికి ఎన్నో విధాలుగా సాయపడిన ఒక బీసీ నాయకుడి కుటుంబం సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు.. అలా రాక్షసానందాన్ని పొందిన చరిత్ర మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డం వివేక్ కుటుంబం ఆశీస్సులు లేకుంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటో ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.