కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు విష‌యంలో కలెక్టర్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాల‌ని, పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో ప‌లు అంశాల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న‌ద‌న్నారు. ఆ దిశగా అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేయాలన్నారు. వరిధాన్యం సేకరణ గతంతో పోల్చితే ఈ సంవత్సరం అధికంగా జరిగిందని వెల్ల‌డించారు. ఇప్పటి వరకు 64.50 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించిన‌ట్లు వెల్ల‌డించారు. 10.55 లక్షల మంది రైతుల ఖాతాలలో ధాన్యం డ‌బ్బులు జ‌మ చేసిన‌ట్లు చెప్పారు. 90 శాతం ధాన్యం సేకరణ పూర్తి చేసిన‌ట్లు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

ధాన్యం నిల్వల కోసం అవసరమైతే స్థానికంగా ఉండే గోదాములను అద్దెకు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం సంబంధించిన ఋతుపవనాలు ఈ సంవత్సరం 15 రోజుల ముందుగా రావడంతో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించి ప్రజలకు వాస్తవాలను తెల‌పాల‌ని సూచించారు. తప్పుడు, అవాస్తవ ప్రచారం చేసే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నకిలీ, నిషేధిత విత్తనాల విక్రయం, తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై పి.డి. యాక్టు నమోదు చేయాలన్నారు. నకిలీ/ నిషేధిత విత్తనాల వినియోగం వలన కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు 3వ విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా పర్యవేక్షించాలని, అధికారులు, స్వయం సహాయక సంఘాల అధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ధరలను నియంత్రించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలకు అనుగుణంగా ఉచిత ఇసుక అందిస్తామ‌ని, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని తెలిపారు.

ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రాజీవ్ యువ వికాసం, ఇందిరా మహిళా శక్తి పథకాల లబ్దిదారులకు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని చెప్పారు. ఆధునిక సాంకేతికత వినియోగించుకొని ఇంటి నిర్మాణం చేపట్టాలని, నిర్మాణ పనుల పురోగతి సంబంధిత ఫొటోలను పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ నెల 29, 30 తేదీలలో ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు వారి జిల్లాలో పర్యటించి పనుల పురోగతి పరిశీలించాలని, జూన్ 1వ తేదీ నాటికి పూర్తి నివేదిక అందించాలన్నారు. కొవిడ్ వైరస్ వ్యాపిస్తున్న దృష్ట్యా, వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు వైరస్ నియంత్రించేందుకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వరిధాన్యం కొనుగోలు, వ్యవసాయం, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాల లక్ష్యాలను సమన్వయంతో పూర్తి స్థాయిలో సాధించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like