ఆదిలాబాద్‌లో ఎందుకు వెనకబడ్డాం..?
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎందుకు వెనకబడింది.. ఇక్కడ బీజేపీకి అన్ని సీట్లు రావడం ఏంటి..? ఆదిలాబాద్‌లో మన ప్రత్యర్ధి భారతీయ జనతా పార్టీనా..? బీఆర్ఎస్ నా…? ఇదీ ఆదిలాబాద్ నేతలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రశ్నల పరంపర. గత ఎన్నికల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఇదే విషయాన్ని మీనాక్షి నటరాజన్ ప్రస్తావించారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం నుంచి ఎంపీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు. మొదటిసారి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయంపై ఆరా తీశారు. పార్టీలో పదవులు.. పార్టీ స్థితిగతులపై కూడా నాయకులతో మాట్లాడారు. ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారామె.
నియోజక వర్గ ఇంచార్జీలతో ఒక్కొక్కరుగా విడిగా సమావేశం అయిన మీనాక్షి అన్నింటిపై దృష్టి సారించారు. భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంలో నేతల నుంచే రాబట్టారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వ్యూహమేంటి..? అని తెలుసుకున్నారు. ఇక, పథకాలు ప్రజల్లోకి ఏవిధంగా పోతున్నాయని నేతల అభిప్రాయాలు సేకరించారు. మీ జిల్లాల్లో ఏమైనా వర్గాలు ఉన్నాయా..? అని అడిగి మరీ తెలుసుకున్నారు. సన్నబియ్యం.. యువ వికాసం పథకాలు ప్రభుత్వానికి మంచిపేరు తెస్తున్నాయని ఎమ్మెల్యేలు, నేతలు ఆమెకు చెప్పారు. పార్టీ సమన్వయంతో పని చేస్తూ పథకాలు జనంలోకి తీసుకెళ్లాలి అని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు.