సింగరేణి వైద్యంపై సీఎండీ సీరియస్
-సింగరేణి వైద్యులూ.. మీ సామర్థ్యం నిరూపించుకోండి
-చిన్నచిన్న వ్యాధులకు మన వద్దే వైద్యం చేయండి
-సింగరేణి వైద్య విభాగానికి ఏటా రూ. 400 కోట్ల వ్యయం
-అయినా అన్ని కేసులను రిఫరల్ పంపితే మన నైపుణ్యత ఏంటి..?
-ఏరియాల వైద్యాధికారుల సమీక్షలో సీఎండీ ఎన్.బలరామ్
Singareni: సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు వైద్య సేవల కోసం ఖర్చుకు వెనకాడకుండా యంత్రాలు, ఔషధాలు సమకూర్చటానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉంది.. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. అయినా కొన్ని ఏరియా ఆసుపత్రుల నుంచి ప్రతిపాదనలు పంపడంలో శ్రద్ధ వహించడం లేదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం హైదరాబాద్ ఆసుప్రతులకు ఎందుకు రిఫర్ చేస్తున్నారు..? మూడేండ్ల కిందట రూ. 30 కోట్లు ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరాయని సింగరేణి సీఎండీ బలరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడానికి ఖర్చుకు వెనకాడకుండా వైద్య పరీక్షల యంత్రాలు, ఔషధాలు సమకూర్చటానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు. అయినా కొన్ని ఏరియా ఆసుపత్రుల నుండి ప్రతిపాదనలు పంపడంలో ఎందుకు శ్రద్ధ వహించడం లేదని సింగరేణి వైద్య శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రుల ప్రధాన వైద్యాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రుల సిబ్బంది తక్షణమే వారికి కావాల్సిన కనీస వైద్య పరికరాలు, అవసరమైన మందుల ప్రతిపాదనలు పంపించాలన్నారు. తాను త్వరలో తనిఖీలు చేస్తానని, ఏ ఒక్క పరికరం లేదనే మాట రాకూడదని హెచ్చరించారు. ఇప్పటికే ఏరియా ఆసుపత్రులకు వైద్యుల్ని కేటాయించామని, ఇంకా అవసరమైన వైద్యుల్ని, టెక్నీషియన్లను సమకూర్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నా అలా చేయకుండా హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ. 30 కోట్లు ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరాయన్నారు. కంపెనీ డాక్టర్లు తమ సమర్థతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతి చిన్న కేసు రిఫర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం యాజమాన్యం ఏటా 400 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని సీఎండీ తెలిపారు. ఆసుపత్రులను ఆధునికీకరిస్తోందన్నారు. హైదరాబాద్ లోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.
గతంలో వైద్య సేవలకు నిధుల మంజూరులో అనేక ఆటంకాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఎటువంటి కోతలు, తగ్గింపులు లేకుండా నిధులు మంజూరు చేయటానికి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. ఈ సానుకూల దృక్పథాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రుల యాజమాన్యాలపై ఉందని ఛైర్మన్ పేర్కొన్నారు. కాగా కోవిడ్ వ్యాప్తి జరిగితే దానిని ఎదుర్కొనేందుకు అన్ని ఏరియా ఆసుపత్రుల్లో తగిన విధంగా సంసిద్ధమై ఉండాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ రావు (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు (పి అండ్ పి, పా), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) ఎన్.వి.రాజశేఖరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.