సింగరేణిలో వనమహోత్సవం
-675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలు
-వనమహోత్సవం ప్రతి ఏరియాలో ఉత్సాహంగా నిర్వహించాలి
-105 చెరువులను స్వయంగా పరిశీలిస్తా
-సమీక్షా సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
Singareni: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ 1 నుంచి సింగరేణి వ్యాప్తంగా పెద్దఎత్తున వన మహోత్సవ కార్యక్రమాలను చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్(Singareni CMD N.Balaram) ఆదేశించారు. ఈ ఏడాది 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలను నాటి సంరక్షించాలని స్పష్టం చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి బిందువు – జల సింధువు కార్యక్రమం ప్రగతిపై ఆయన ఆరా తీశారు. వన మహోత్సవం కోసం ఏర్పాట్లపై సంస్థ డైరెక్టర్లు, ఏరియాల జీఎంలు, అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏరియాల వారీగా వన మహోత్సవ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత లక్ష్యాల మేరకు మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవాన్ని ప్రతి ఏరియాలో ఉత్సాహంగా నిర్వహించాలని, కార్మికులు, స్థానికులు పాల్గొనేలా చూడాలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుదలకు సంస్థ చేపట్టిన నీటి బిందువు-జలసింధువు కార్యక్రమంపై కూడా సమీక్షించారు. సింగరేణి ప్రాంతంలో మొత్తం 62 మినీ చెరువులను తవ్వాలని నిర్ణయించగా వీటిలో ఇప్పటికే 48 చెరువుల నిర్మాణం పూర్తవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన చెరువుల నిర్మాణం వారంలోగా పూర్తి చేయాలని కోరారు.
ఆయా ఏరియాల్లో 43 చెరువుల్లో పూడికతీత పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇందులో 25 చెరువుల్లో పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీటిని పూర్తి చేయడం ద్వారా సింగరేణి ఆధ్వర్యంలో 105 నూతన చెరువుల నిర్మాణం, పూడికతీత చేసినట్లు అవుతుందని, ఇది అతి పెద్ద సామాజిక ప్రయోజన కార్యక్రమంగా నిలిచిపోతుందని బలరామ్ వెల్లడించారు.
వర్షాకాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెరువుల్లో నీరు చేరే విధంగా సివిల్ పనులు పూర్తి చేయాలని, నీటి నిలువ గరిష్టంగా ఉండేలా చూడాలని సూచించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, చెరువు కట్టలు పటిష్టంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో 105 చెరువులను స్వయంగా పరిశీలిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ పిపి , పా కె.వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభాని, సింగరేణి అటవీశాఖ సలహాదారులు మోహన్ పరిగేన్, జీఎం సీపీపీ ఎ.మనోహర్, జీఎం (ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్రీ) సైదులు పాల్గొనారు.