తెలంగాణ పునర్నిర్మాణం దిశగా అడుగులు
Telangana Formation Day Celebrations :తెలంగాణ వచ్చాక పదేళ్ల తర్వాత కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను తాము చక్కదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి సిఎం మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. “సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు.. రాష్ట్ర ప్రజల కలలు నిజం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు. దశాబ్దాల పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పదేళ్ల ఆధిపత్యం తిరస్కరించి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మేము బాధ్యతలు స్వీకరించే నాటికి ఆర్థిక పరిస్థితి ఆగమాగమైంది. నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చేశాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా” అని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలని తెలిపారు. మహిళా సంఘాలకు క్యూఆర్ కోడ్ కూడిన కార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకువస్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. సివిల్స్‌కి ఎంపికైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతులకు రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేశామని అన్నారు.
ఈ వేడుకల్లో మొదటగా ముఖ్యమంత్రి తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఓపెన్ టాప్ జీప్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ఛీప్ గెస్ట్ గా జపాన్ లోని కితక్యూషు సిటీ మేయర్ కజహిసా టకేచి హాజరయ్యారు. ఈ సందర్బంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించారు. పలువురు పోలీసుకు సేవా పతకాలను అందజేశారు.