కొమురం భీమ్ జిల్లాకు గజరాజుల భయం
తెలంగాణలోని కొమురం భీమ్ జిల్లాలో మళ్లీ ఏనుగులు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లో చంద్రాపూర్ జిల్లాలో నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అందులో రెండు ఏనుగులు తెలంగాణలో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఒక ఏనుగులు గతంలో ఇక్కడకు వచ్చి వెళ్లిందే. దీంతో ఖచ్చితంగా ఆ రెండు ఇటువైపు వస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాటింపు వేయించిన అధికారులు…. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలీ జిల్లాలో ఏనుగుల మంద సంచరిస్తుందన్న సమాచారంతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రాణహిత దాటి ఏ క్షణమైనా ఏనుగులు కొమురంభీం జిల్లాలోకి వచ్చే అవకాశాలున్నాయన్న సమాచారంతో అలర్ట్ అయింది. ఏనుగుల మందలో రెండు ఏనుగులు ఇటు వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందులో ఒకటి గతంలో ఇక్కడికి వచ్చి వెళ్లింది కావడం గమనార్హం. రెండు ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశం ఉండటంతో అధికారులు ఏం చేయాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో కాగజ్ నగర్ కారిడార్ లోకి వచ్చిన ఏనుగు భీభత్సం సృష్టించింది. 24 గంటల్లో ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకుంది. మంద నుంచి వేరుపడిన ఓ మగ ఏనుగు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సరిహద్దు దాటి ప్రాణహిత నదీ తీరం వెంట వస్తూ తెలంగాణలోకి వచ్చింది. బూరుపెల్లిలోని మిర్చి తోటలోకి దూసుకొచ్చిన ఏనుగు రైతు అల్లూరి శంకరయ్య ప్రాణాలు తీసింది. కొండపల్లిలో పొలానికి నీరు పెడుతున్న బూర పోచయ్య అనే రైతును చంపేసింది. దీంతో ఇప్పుడు రెండు ఏనుగులు వచ్చే అవకాశం ఉండటంతో సిర్పూరు నియోజకవర్గ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పులుల సంచారంతో ప్రజలు వణికిపోతుండగా ఇప్పుడు ఏనుగుల రాక వారిని మరింత భయాందోళనకు గురి చేస్తోంది.
ఏనుగులను నియంత్రించాలంటే.. వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టడం అత్యంత కీలకమని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఏనుగుల సంచారం రాత్రిపూటే ఎక్కువ ఉంటుందని.. కనుక రాత్రిపూటా పనిచేసే థర్మల్ కెమెరా డ్రోన్లను విరివిగా వినియోగించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇక్కడకు వచ్చిన ఆ ఏనుగు చింతలమానెపల్లి, పెంచికల్‌పేట , బెజ్జూర్ మండలాల్లో48 గంటలకు పైగా సంచరించి విధ్వంసం సృష్టించింది. ఈ ప్రాంతంలో సంచరించిన సమయంలో ఆహార అన్వేషణ చేసిన ఈ మదగజం తిరిగి తన గుంపును ఇక్కడికి తీసుకొచ్చే ప్రమాదం అటవీశాఖ అధికారులు అప్పుడే అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ఆ ఏనుగు తిరిగిరానుంది.
ఆ ఏనుగు తిరిగిన ప్రాంతాలు పచ్చని పంటపొలాలు, చెరుకు , పుచ్చకాయ తోటలు సమృద్ధిగా నీరు ఉండటంతో… ఏనుగులు స్థిరపడేందుకు అనువైన పరిస్థితులు ఇక్కడున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ ఏనుగు తన గుంపును తీసుకువచ్చేందుకు సమాయత్తం అయ్యింది. రెండు ఏనుగులు వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అలర్టయ్యారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో డప్పు చాటింపు సైతం వేయించారు. రైతులు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.