కాంగ్రెస్‌లో ఓరియంట్ మంటలు
Group war in Congress: మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య గ్రూప్ వార్ మళ్లీ మొదలైంది. ఈసారి ఓ కంపెనీలో జరుగుతున్న ఎన్నికల కోసం.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకవైపు, ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అన్నట్టుగా మారింది పరిస్థితి. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనేది మాత్రం ఇప్పటికి ప్రశ్నార్థకమే..
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎమ్మెల్యేల వర్గపోరుకు వేదికగా మారింది. ఈ ఎన్నికలకు సంబంధించిన తేదీ రాకముందే రాజకీయం వేడెక్కింది.సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి అంటూ అధికారికంగా పేరు ప్రకటించారు. బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ ఎమ్మెల్యేలు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో విక్రమ్ రావును ఆదివాసీ కార్మిక సంఘం తరఫున బరిలో దింపుతున్నట్లు ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది. ఇప్పటికే అదే పార్టీకి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సోదరుడు, సత్యపాల్ రావు ఆ ఎన్నికలపై కన్నేశారు. సడెన్‌గా ముగ్గురు ఎమ్మెల్యేలు విక్రమ్‌రావును తెరపైకి తేవడం ప్రేంసాగర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టం అవుతోంది.
ఎన్నికల తేదీ బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఎన్నికలు ఎప్పుడో నిర్వహించాల్సి ఉంది. కాల పరిమితి ముగిసి మూడేండ్లు గడిచినా ఎన్నికలు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మూడు సార్లు కార్మిక సంఘాలతో సమా వేశం నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటించ లేదని కార్మికులు, కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో కార్మికశాఖ కార్యాలయాల ఎదుట ఆందోళన సైతం తెలిపారు. గతంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రేంసాగర్ రావు వర్గం పోరాటం చేసింది. ఎట్టకేలకు కార్మిక శాఖ కదిలి వచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యింది.
యూనియన్లు, యాజమాన్యం కలిసి సమావేశం నిర్వహించి ఎన్నికలపై తేదీని ప్రకటించే అవకాశం ఉండగా, ఇంతలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు అభ్యర్థిని ప్రకటించడంతో అప్పటికే బరిలో ఉన్న సత్యపాల్ రావుకు ఎలాంటి సంబంధం లేనట్లుగా తయారయ్యింది పరిస్థితి. ఆయన ప్రేంసాగర్ రావు సోదరుడు.. ఆయన సొంత మండలం కావడం, ఇక్కడ క్యాడర్ బలంగా ఉంటుంది. అంతేకాకుండా, ప్రేంసాగర్ రావు తండ్రి రఘుపతిరావు గతంలో పలుమార్లు ఇక్కడ అధ్యక్షుడి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే సత్యపాల్ రావు బరిలో నిలిచేందుకు సన్నద్దం అవుతుండగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేల సడెన్ ఎంట్రీతో రాజకీయం కాస్తా రసకందాయంలో పడింది.
ఇక తాము ఎటు వైపు నిలబడాలి… ఎవరికి మద్దతు తెలపాలి అనే విషయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విడమంటే పాము కోపం.. లేదంటే కప్పకి కోపం అన్నట్లుగా ఉంది ఇక్కడి నేతల పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఎన్నికల తేదీ ప్రచారం ఇంకెంత జోరు ఉంటుందో అనే చర్చసాగుతోంది. కేవలం ప్రేంసాగర్ రావు వర్గానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో హడావిడిగా అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లోనే ఇద్దరు అభ్యర్థులు నిలబడటం ఎవరు గెలుస్తారో..? అనే అంశంపై చర్చ సాగుతోంది.