దళ సభ్యుడి నుంచి దండకారణ్యం దాకా…
Encounter: అడెల్లు అలియాస్ భాస్కర్(Adellu alias Bhaskar) పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరది. యువతను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షించడం, పార్టీకి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంలో అందె వేసిన చేయి.. ఎన్నోసార్లు ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకునేవాడు. ఆయన చురుకుదనం చూసిన మావోయిస్టు పార్టీ ఆయనను తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించింది. చాలా తొందరగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన నేతల్లో ఆయనను ఒకరిగా చెబుతారు. ఈ రోజు నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కొమురం భీమ్ ,మంచిర్యాల ఏరియా జిల్లా కమిటీ కార్యదర్శి అడెల్లు మరణించడం ఆ పార్టీకి పెద్ద దెబ్బనేనని చెబుతున్నారు.
భాస్కర్ నేపథ్యం ఇది..
బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో జన్మించిన భాస్కర్ 10వ తరగతి వరకు బోథ్‌లో చదివారు. 1989-91లో నిర్మల్ లో ఇంటర్ చేశారు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) అధ్యక్షుడిగా పని చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన భాస్కర్ ఆ సమయంలోనే నక్సల్ బరి వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థి దశలోనే 1989 కాలంలో భూపోరాటాలు విస్తృతంగా సాగుతున్న సమయంలో తాను కూడా అందులో పాల్గొన్నాడు. 1994-95 లో దళంలోకి ప్రవేశించాడు. బోథ్ దళ సభ్యుడిగా పని చేసి ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్ గా ఎదిగాడు. కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు చత్తీసఘడ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. 25 ఏళ్ల వయసులో భాస్కర్ దళంలో చేరినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. తల్లిదండ్రులు చనిపోయారు. భాస్కర్ కు ముగ్గురు సోదరులు. ఆయన దళంలో పని చేస్తున్న సమయంలోనే సహచరురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నట్లు చెప్తారు. ఆమె ఎన్కౌంటర్లో మరణించారు.
రిక్రూట్మెంట్ పైనే ప్రధాన దృష్టి..
దళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన భాస్కర్ మావోయిస్టు పార్టీలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కొమురం భీమ్ ,మంచిర్యాల ఏరియా జిల్లా కమిటీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చాలా తొందరగా రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారని పోలీసు వర్గాలు చెబుతాయి. 1995లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. చత్తీస్ఘడ్ ప్రాంతంలో పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రిక్రూట్మెంట్ పై దృష్టి సారించి ఇక్కడ చాలా మందిని పార్టీ వైపు ఆకర్షించేలా చేయడంలో విజయం సాధించారు. ఆయన ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన దాదాపు ఎనిమిది ఎన్కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్నారు. కడంబా అడవుల్లో సైతం జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు చుట్టుముట్టినా తప్పించుకోగలిగారు.
మావోయిస్టు పార్టీకి తీరని నష్టం
భాస్కర్ అలియాస్ అడెల్లు ఎన్కౌంటర్లో మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటని చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూలమూలనా పరిచయాలు ఉన్న ఆయన చనిపోవడం పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెబుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో యువత మావోయిస్టు పార్టీలో చేరారు. ఆయన కోసం ఏకంగా నాలుగు జిల్లాల ఎస్పీలు రంగంలోకి దిగి మరీ మట్టుబెట్టేందుకు ప్రయత్నాలు చేసేవారు. ఆయన ఏనాడూ పోలీసులకు చిక్కలేదు. ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రల్లో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆయన పేరు వినిపించేది. కానీ చివరి క్షణాల్లో అడెల్లు తప్పించుకునేవాడు. చివరకు ఆయన ఎన్కౌంటర్లో నేలకొరగడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బనే.