పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ

BRICS summit:బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాకిస్తాన్‌పై భార‌త ప్ర‌ధాని మోదీ నిప్పులు చెరిగారు. ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తు ఇస్తున్న ఆ దేశంపై దుమ్మెత్తి పోశారు. ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఒకే త్రాసులో తూయలేమని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో కొందరు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకుందని భారత్ ఎప్పటినుంచో ఆధారాలతో సహా ఆరోపిస్తున్న విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. ప‌హల్గామ్ దాడిని ఖండించి, భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి మొత్తం మాన‌వాళిపై జ‌రిగిన దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. మ‌హాత్మాగాంధీ, గౌత‌మ బుద్ధుడి నుంచి ప్రేర‌ణ పొంది భార‌త్ శాంతి మార్గాన్ని కొన‌సాగిస్తోంద‌న్నారు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ‘రియో డి జనీరో డిక్లరేషన్’ పేరుతో ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉగ్రదాడిని ప్రకటన తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానికి ప్రేరణ ఏదైనా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు పాల్పడినా అది నేరమేనని, అన్యాయమని పునరుద్ఘాటించింది. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులను, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని, వారికి సురక్షిత స్థావరాలు కల్పించడాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటామని బ్రిక్స్ దేశాలు ప్ర‌క‌టించాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like