ఆర్డీవో బెదిరిస్తున్న‌డు…

Prajaveni: త‌న అన్న‌కు త‌న‌కు జ‌రుగుతున్న ఓ పంచాయ‌తీలో మంచిర్యాల ఆర్డీవో ఏకప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడ‌ని వీర‌మ‌ల్ల ముర‌ళి అనే వ్య‌క్తి సోమ‌వారం ప్ర‌జావాణిలో క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. త‌న‌ను నానా ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తూ త‌న అన్న వైపే తీర్పు చెబుతాన‌ని బెదిరిస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌న అన్న స‌త్త‌న్న ఎన్టీపీసీలో ఉద్యోగం చేశాడ‌ని దానికి సంబంధించి పెన్ష‌న్ కూడా అందుతోన‌ని చెప్పాడు. త‌న త‌ల్లిదండ్రుల‌ను తానే చూసుకుంటున్నాన‌ని వెల్ల‌డించాడు. అందు కోసమ‌ని త‌న తండ్రి స్వ‌గ్రామమైన జ‌న్నారం మండ‌లం చింత‌గూడ‌లో ఉన్న ఎక‌రం 19 గుంట‌ల భూమి త‌న పేరిట రిజిస్ట్రేష‌న్ చేశార‌ని వెల్ల‌డించారు.

దీంతో త‌న అన్న స‌త్త‌న్న త‌న‌పై ద్వేషంతో త‌న తండ్రి, అక్క‌ల‌తో క‌లిపి త‌న‌పై కోర్టులో కేసు వేయించార‌ని ముర‌ళి వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో తాను కూడా క‌రీంన‌గ‌ర్‌లో ఉన్న ఇంటిని ఈ కేసులో క్ల‌బ్ చేయాల‌ని కోర్టుకు విన్న‌వించుకున్న‌ట్లు చెప్పాడు. అయితే, ఆర్డీవో కార్యాల‌యంలో పెట్టిన పిటిష‌న్ ఆధారంగా మంచిర్యాల ఆర్డీవో త‌న‌కు నోటీసులు పంపించాడ‌ని ఆ నోటీసుతో పాటు ఫిర్యాదు కాపీని జ‌త చేయ‌లేద‌న్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు కాపీని అడిగినా ఇవ్వ‌లేద‌ని కార్యాల‌యం చుట్టూ తిప్పించుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు 16-06-2025 రోజున ఫిర్యాదు కాపీని ఇచ్చి తెల్ల‌వారే ఆర్డీవో కార్యాల‌యంలో హాజ‌రు కావాల‌ని ఫోన్ ద్వారా చెప్పిన‌ట్లు ముర‌ళి వెల్ల‌డించాడు.

తాను ఆర్డీవో ముందు హాజ‌రుకావ‌డంతో పాటు త‌న లాయ‌ర్ల‌ను సైతం వెంట తీసుకువెళ్లిన‌ట్లు చెప్పాడు. త‌న అన్న‌కు సంబంధించి ఫిర్యాదుకు వ్య‌తిరేకంగా తాను ఇచ్చిన కాపీని తీసుకునేందుకు ఆర్డీవో అంగీక‌రించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో త‌దుప‌రి విచార‌ణ ఏ తేదీన నిర్వ‌హించేది చెప్ప‌మ‌ని ఎన్నిసార్లు అడిగినా క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. తాను త‌గిన సాక్ష్యాలు ప్ర‌వేశ‌పెడ‌తాన‌ని చెప్పినా ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హరిస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోనని ఏకంగా ఆర్డీవో బెదిరిస్తున్నాడ‌ని చెప్పాడు. నేను అందించిన కౌంట‌ర్ తీసుకోన‌ని, ఏక‌ప‌క్షంగా తీర్పు చెబుతాన‌ని అంటున్నాడ‌ని ముర‌ళి క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చాడు. ఇప్ప‌టికైనా ఈ వ్య‌వ‌హారంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ను వేడుకున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like