మ‌న ఎరువులు.. మ‌హారాష్ట్రకు..

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో హాకా ఉద్యోగుల నిర్వాహకంతో రెండు వాహ‌నాల్లో త‌ర‌లిస్తున్న మూడు ల‌క్ష‌ల విలువ చేసే యూరియా అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా మంగ‌ళ‌వారం పోలీసులు ప‌ట్టుకున్నారు. రైతులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అక్ర‌మ త‌ర‌లింపు అడ్డుకుని ఐదుగురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు…
————–
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి టోల్‌ ప్లాజా వద్ద గ‌త ఆదివారం రాత్రి మూడు వాహ‌నాల్లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వాటిని వెంబ‌డించారు. ఖ‌మానాలోని హాకా కేంద్రానికి చేరాల్సిన ఎరువుల‌ను వేరే ప్రాంతానికి తీసుకువెళ్తుండ‌గా ఆ వాహ‌నాల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, వాంకిడిలో వెతకగా, ఓ వాహనం మాత్రం పట్టుబడింది.

ఇది ప్ర‌తి ఏటా జ‌రుగుతున్న తంతే. మ‌న ఎరువులు మ‌హారాష్ట్రకు చేర‌వేస్తూ కొంద‌రు అక్ర‌మార్కులు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు కావ‌డంతో ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సప్లై చేస్తున్న యూరియా, కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున మహారాష్ట్రకు తరలుతోంది. ఫర్టిలైజర్స్ నిర్వాహకులు రాత్రివేళల్లో బొలెరోలు, డీసీఎం వ్యాన్లు, ఆటో ట్రాలీల్లో దొంగచాటుగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడి రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే వ్యాపారులు మాత్రం పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అడపాదడపా పట్టుకుంటున్నా అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. వ్యాపారులకు కొంతమంది వ్య‌వ‌సాయ శాఖ‌ అధికారుల అందడదండలు ఉండడంతోనే ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎక్కువ రేట్లకు అమ్మకం
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల నుంచి మ‌హారాష్ట్రకు త‌ర‌లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ ఎరువుల కొరత ఉండడంతో ఎక్కువ రేట్లకు అమ్మతూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా బస్తాలను ఇక్కడ రైతులకు రూ.270 నుంచి రూ.280కి అమ్ముతుండగా, మహారాష్ట్రలో రూ.330 వరకు అమ్ముతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రూ.350 నుంచి రూ.400 వరకు కూడా విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 అదనంగా వస్తుండడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున మహారాష్ట్రకు సప్లై చేస్తున్నారు.

అక్క‌డికి త‌ర‌లింపు.. ఇక్క‌డ కొరత
మన ఎరువులు మహారాష్ట్రకు తరలిపోతుండడంతో ఇక్కడి రైతులకు కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం ఎరువుల అక్రమాలను అరికట్టేందుకు పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తున్నా వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుల జిరాక్స్లు తీసుకొని వారికి ఎన్ని ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాలి. కానీ వ్యాపారులు తమకు తెలిసిన రైతులు, సాగులో లేని భూముల పాస్ బుక్‌లు, ఆధార్ కార్డులు సేకరించి వారి పేరిట మహారాష్ట్రకు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తూ ఫర్టిలైజర్స్ నిర్వాహకులు ఇక్కడి రైతులకు కొర్రీలు పెడుతున్నారు.

ఫిర్యాదులు వస్తేనే కదలిక
మహారాష్ట్రకు ఎరువుల అక్రమ రవాణా గురించి వ్యవసాయ అధికారులకు తెలిసినా ఫిర్యాదులు వస్తే తప్ప కదలడం లేదు. గ‌త ఆదివారం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి వ‌ద్ద ప‌ట్టుకున్న వాహ‌నం విష‌యంలో కానీ, తాజాగా మంగ‌ళ‌వారం బేల మండ‌లంలో ప‌ట్టుకున్న ఎరువుల వ్య‌వ‌హారంలో కానీ, రైతులే స‌మాచారం ఇచ్చి ప‌ట్టిస్తే కానీ వారిని ప‌ట్టుకోలేదు. ఈ రెండు ఘ‌ట‌న‌లు హాకా కేంద్రాల‌కు సంబంధం ఉన్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా.. యూరియా రవాణా వెనుక అధికారుల హస్తమున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. విత్తనాలు, ఎరువులు అమ్మకాలు ప్రారంభం కాకముందు తనిఖీలు చేస్తూ హడావుడి చేసిన వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు.. ప్రస్తుతం సాగు ఊపందుకున్న సమయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

యూరియా అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు.
బేల మండలం హాకా ప్రొప్రైటర్ సునీల్, ఉద్యోగి అజయ్ క‌లిసి మహారాష్ట్రలోని ఫెర్టిలైజర్ దుకాణం యజమాని నిఖిల్ తో ఒప్పందం కుదుర్చుకొని మూడు లక్షల విలువచేసే ఫెర్టిలైజర్ రెండు వాహనాలలో యూరియా అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు ప‌ట్టుకున్నారు. వాహన డ్రైవర్లైన వాంకడే దిలీప్, చిలకలవార్ చంద్రశేఖర్ తో స‌హా మొత్తం ఐదుగురిపై కేసు న‌మోదు చేశారు. రైతుల ద్వారా అందిన స‌మాచారం మేర‌కు జైనథ్ సిఐ డి.సాయినాథ్ , బేల ఎస్సై నాగనాథ్ బృందం వారిని పట్టుకున్నారు. ఆదిలాబాద్ డిఎస్పీ ఎస్ జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను వెల్లడించారు. వీరిపై సెక్షన్లు 316, 318 BNS ప్రకారం బేల పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రెండు వాహనాలలో 150 బ్యాగుల్లో దాదాపు 67.5 క్వింటల ఫర్టిలైజర్ ను మహారాష్ట్రకు తరలించకుండా అడ్డుకున్నామ‌ని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like