సమ్మె జేసుడే… సంగతి జూసుడే..
సింగరేణిలో మోగనున్న సమ్మె సైరన్
Singareni Strike: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు సైతం సమ్మెలోకి దిగనున్నారు. ఈ మేరకు కార్మిక సంఘాలన్నీ సిద్ధమయ్యాయి. రేపు (జూలై 9) దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె జరగనుంది. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడనుంది. ఒక్కరోజు సమ్మెతో దాదాపు 76 కోట్ల రూపాయల విలువ చేసే బొగ్గు ఉత్పత్తికి నష్టం కలగనుంది.
ఈ సమ్మె విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలన్నీ ఇప్పటికే సమాయత్తం అయ్యాయి. ఆయా కార్మిక సంఘాల నేతల సింగరేణిలో సమావేశం నిర్వహించారు. AITUC, INTUC, CITUC, HMS.. నాయకులు, ఒక్కరోజు సమ్మె విజయవంతం కోసం గేట్ మీటింగ్ నిర్వహించారు. సమ్మె విజయవంతం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్తవానికి ఈ సమ్మె గత మార్చి 20న జరగాల్సి ఉంది. కానీ, యుద్ధం కారణంగా వాయిదా పడింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఐదు జాతీయ సంఘాల్లో నాలుగు సమ్మెకు మద్దతు తెలిపాయి. బీజేపీ అనుబంధ సంఘం BMS మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. విప్లవ కార్మిక సంఘాలు సైతం సింగరేణి సమ్మెకు మద్దతు ప్రకటించాయి. కార్మికుల హక్కులు రక్షించుకోవాలంటే సమ్మెలో కచ్చితంగా పాల్గొనాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
అయితే, ఒక్కరోజు సమ్మెతో సింగరేణిపై పెనుభారం పడుందని, సమ్మె విరమించుకోవాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది. ఒక్కరోజు సమ్మెతో దాదాపు రూ. 76 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతుందని, కార్మికులు కూడా వేతన రూపంలో దాదాపు 13 కోట్లు నష్టపోవాల్సి వస్తుందిని యాజమాన్యం స్పష్టం చేసింది. ఒక్కరోజు సమ్మెతో 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని వెల్లడించింది. ఈ ఏడాది లక్ష్యసాధనకు శ్రమించాల్సి ఉన్న తరుణంలో ఈ సమ్మె సరికాదని యాజమాన్యం చెబుతోంది. సమ్మె డిమాండ్ల చాలా వరకు సింగరేణికి సంబంధించినవి కావని స్పష్టం చేసింది. ఈ మేరకు కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా చూస్తోంది.
కానీ, కార్మిక సంఘాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మె చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. సమ్మె చేసి కార్మిక లోకం శక్తి కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తామని కార్మిక సంఘం నేతలు వెల్లడిస్తున్నారు.