యూరియా కోసం తిప్పలు
Urea: అదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ వద్ద యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. బజార్హత్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార గిడ్డంగుల వద్ద యూరియా కోసం వర్షంలో తడుస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం టన్నుల కొద్ది యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నా, తమకు మాత్రం అనుకున్నంతగా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా విడతలవారీగా అది కూడా తక్కువ మొత్తంలో యూరియా సరఫరా చేయడంతో తమకు అవస్థలు తప్పడం లేదని కర్షకులు చెబుతున్నారు. ఈ మేరకు వర్షంలో తడుస్తూ తమ చెప్పులను క్యూలైన్లో పెట్టి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు యూరియా అందజేయాలని రైతులు కోరుతున్నారు.