ఈ నియోజకవర్గం.. ఆ మంత్రి దూరం..
-ప్రేంసాగర్ రావును కాదని వివేక్‌ను మంత్రిని చేసిన అధిష్టానం
-వివేక్‌ను నియోజకవర్గంలో అడుపెట్టనివ్వమని ఎమ్మెల్యే, సొంత పార్టీ నేతల ప్రతిన
-ఇప్పటి వరకు మంచిర్యాలకు రాని మంత్రి వివేక్
-రేపటి మంత్రుల కార్యక్రమానికి కూడా డుమ్మా
రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.. కానీ, ఓ మంత్రి మాత్రం తన సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. కాదు.. కాదు.. కాలు పెట్టనివ్వడం లేదు. మంత్రి మా నియోజకవర్గంలోకి రావొద్దంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరించడంతో మంత్రి అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు.
కొత్తగా మంత్రిలోకి వచ్చిన వివేక్ సొంత పార్టీలో, పైగా సొంత జిల్లాలోనే తలనొప్పులు తప్పడం లేదు. ఆయన ఎన్నికల వరకు వేరే పార్టీలో ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయన వచ్చీ రావడంతో తనకు, తన అన్న వినోద్‌కు టిక్కెట్టు సాధించుకున్నారు. అంతేకాకుండా, తన కొడుకు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టు సంపాదించిపెట్టారు. ఇదంతా ఒక్కెత్తు కాగా, మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. అయితే, ఇన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాను ఎన్నో ఏండ్లుగా పార్టీని పట్టుకుని ఉంటున్నానని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సైతం ఆయన పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నానని, తనపై ఎన్నో కేసులు కూడా నమోదు అయినా, వాటన్నింటిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశానని ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్వహించిన భట్టి పాదయాత్ర, ఖర్గే బహిరంగ సభను సైతం విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.
కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిదో ఏమో కానీ… ప్రేంసాగర్ రావును కాదని వివేక్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో అటు ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరవర్గం ఇప్పుడు వివేక్ అంటే మండి పడుతున్నారు. తాము ఎన్నో ఏండ్లుగా కష్టపడి పార్టీని కాపాడుకుంటూ వస్తే కేసులకు భయపడకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వివేక్‌ను మంత్రి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పది రోజుల కిందట ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నిలదీశారు. కష్టపడ్డది తామైతే ఫలితం దక్కింది మరొకరి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పదవి ఇవ్వాలని చూసిన అధిష్టానం ఆఫర్ ను ఆయన తిరస్కరించారు. తనకు మంత్రి పదవి తప్ప వేరే ఏం వద్దంటూ అక్కడి నుంచి వచ్చేశారు.
కాంగ్రెస్ తమ నేతకు అన్యాయం చేసిందని ఆగ్రహంతో ఉన్న ప్రేంసాగర్ రావు అనుచరులు తమ నేతకు దక్కాల్సిన మంత్రి పదవి గద్దలా తన్నుకుపోయిన గడ్డం వివేక్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో తన కొడుకు వంశీకృష్ణను గెలిపిస్తే ప్రేంసాగర్ రావు మంత్రి పదవికి తాను అడ్డురానని చెప్పిన వివేక్ తీరా మంత్రి కావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరవర్గం తమ నియోజకవర్గంలో అడ్డుపెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్‌కే అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ మంత్రి మంచిర్యాల వస్తే గొడవలు తప్పవని, ఆయనను మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టనీయమని ప్రతిజ్ఞ చేశారు.
దీంతో ఎందుకైనా మంచిదని మంత్రి వివేక్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఆయన జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో అడుగుపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైతం ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటు వైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగుపెట్టలేదు. ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరుల హెచ్చరికల పుణ్యమా అని మంచిర్యాల నియోజకవర్గం రావడం లేదు. మంత్రి వివేక్ రాకున్నా తన నియోజకవర్గ అభివృద్ధి ఆగకుండా చూసుకుంటున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరులు మంత్రిని మాత్రం నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ భీష్మించుకున్నారు.
తాజాగా రేపు (ఆదివారం) మంచిర్యాలకు ముగ్గురు మంత్రులు రానున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, జిల్లా ఇన్చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సైతం మంత్రి వివేక్ హాజరుకావడం లేదంతే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి మంత్రిగా వివేక్ ఎప్పుడైనా మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెడతారా..? ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారా..? వేచి చూడాల్సిందే..