నాయకులు… విద్యార్థులైన వేళ..
వాళ్లు ప్రజాప్రతినిధులు… అందులోనూ ఒకరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయితే, మిగతా ఇద్దరు మంత్రులు… ఇంకొకరు ఎమ్మెల్యే… క్షణం తీరిక లేని వ్యవహారాలు.. కానీ ఒక్కసారిగా అన్నీ మరిచిపోయారు. విద్యార్థులుగా మారిపోయారు. విద్యార్థుల్లా బెంచీల మీద కూర్చుని గతాన్ని నెమరేసుకున్నారు.. వారు ఎవరో కాదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇక మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు. మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేటలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 10. 20 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన వారంతా లోపలికి వెళ్లారు. అక్కడ బెంచీలను చూసిన డిప్యూటీ సీఎం విక్రమార్క వాటిపైనే కూర్చుకున్నారు. భవనం చాలా బాగుందని, లోపల కూడా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. అదే సమయంలో మిగతా ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సైతం అవే బెంచీలపై కూర్చుండిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థి జీవితం గురించి మాట్లాడుకుంటూ నేతలు నవ్వుకున్నారు. కొద్దిసేపు వాళ్లే విద్యార్థులుగా మారిన వైనం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.