మావోయిస్టు నేతల లొంగుబాట
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇవాళ సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్నఅలియాస్ గోపన్న, ఆత్రం అరుణ లొంగిపోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా.. బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు. లచ్చన్న దాదాపు 30 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపెల్లి.
ఆపరేషన్ కగార్’ (Operation Kagar) తర్వాత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు వరుస పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. పోలీసుల ఒత్తిడి, ప్రభుత్వ పునరావాస విధానాలతో చాలా మంది ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మే 2025లో 20 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా, 8 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. జూలై 14, 2025న మరో ఐదుగురు మావోయిస్టులు ములుగు ఎస్పీ శబరీష్ సమక్షంలో లొంగిపోయారు. ‘పోరు కన్నా ఊరు మిన్న’ కార్యక్రమం ద్వారా మావోయిస్టులను సమాజంలో కలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది.