త‌గ్గిన ఎంపీటీసీల సంఖ్య

Local body elections in Telangana:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పంచాయ‌తీ సిబ్బంది అన్నిర‌కాలుగా సిద్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC), పంచాయతీ స్థానాల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ పంచాయతీ స్థానాల సంఖ్యను ఖరారు చేసింది. మొత్తం 566 జడ్పీటీసీ స్థానాలు, 566 ఎంపీపీ స్థానాలు, అలాగే 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. పంచాయ‌తీ సిబ్బంది ఎన్నిక‌ల సామ‌గ్రి సిద్ధం చేసుకోవాల‌ని వెల్ల‌డించింది.

గ‌తంతో పోల్చితే ఎంపీటీసీ స్థానాల సంఖ్య 44 వ‌ర‌కు త‌గ్గింది. అత్య‌ధికంగా న‌ల్గొండ‌లో 353 ఎంపీటీసీ స్థానాలు, ములుగులో అత్య‌ల్పంగా 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్టంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 ఉండగా, వార్డుల సంఖ్య 1,12,000గా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే, 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పటి ఎన్నికల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు 570 ఉండగా, ఎంపీటీసీ స్థానాలు 5,817, గ్రామ పంచాయతీలు 12,848గా ఉన్నాయి.

సెప్టెంబర్ 30వ తేదీలోగా తెలంగాణలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన ఆర్డినెన్స్ సిద్ధం చేసి ఇప్పటికే గవర్నర్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు అధికారికంగా తెరలేవనుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం, శాంతిభద్రతల పరిస్థితి, గిరిజన ప్రాంతాలకు పోలింగ్ సిబ్బంది రవాణా, పోలింగ్ మెటీరియల్ తరలింపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like