అటవీ శాఖ అధికారులపై రాళ్లదాడి
Stone attack on forest department officials: అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులపై ముల్తానీలు తిరగబడ్డారు. వారిపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. అటవీశాఖ, పోలీసుల వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. గాయాలపాలైన సిబ్బందిని ఇచ్చోడ, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలర్ట్ అయిన పోలీసులు పెద్ద ఎత్తున భారీ బలగాలతో కేశవపట్నం చేరుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మ, బాబ్జిపేట్ బీట్ పరిధిలోని 172, 174 కంపార్ట్మెంట్లలోని పోడుభూములలో మొక్కలు నాటేందుకు ఈ నెల 5న అటవీ అధికారులను కేశవపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ భూములు తమవేనని కేశవపట్నం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అవి అటవీ భూములని తాము మొక్కలు నాటాల్సిందేనని అటవీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో రగడ రాజుకుంది. అధికారులు, గ్రామస్థులు వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడి అటవీ అధికారులను వెనక్కి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
తాజాగా అటవీ అధికారులు శనివారం కేశవపట్నం పంచాయితీ బాబ్జిపేట బీట్ 71, 72 కంపార్ట్మెంట్లలోని అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. దీంతో ఎదురు తిరిగిన ముల్తానీలు రాళ్లు , కర్రలతో అటవీశాఖ, పోలీసులపై దాడికి యత్నించారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్వ గాయాలయ్యాయి. పోలీస్ సిబ్బంది తలలు పగిలాయి. అటవీ, పోలీస్ శాఖ వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడితో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన అటవీ సిబ్బంది పోలీసుల రక్షణ వలయంలో ఇచ్చోడ చేరుకున్నారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు అధికారులు ఆందోళనకారులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సమక్షంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.