దిగొచ్చిన సర్కార్
G.O. 49:కొద్ది రోజులుగా ఆదివాసీల ఆందోళనలకు కారణమైన జీవో 49 నిలుపుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఆదివాసీల్లో అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం విపరీతంగా పెరిగింది. మహారాష్ట్ర తాడోబా నుంచి పులులు ఇక్కడకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లా నుంచి భద్రాచలం వరకు మూడు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించింది. మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల రిజర్వ్ ను అటవీ ప్రాంతం మీదుగా ఒక కారిడార్ ఏర్పాటు చేశారు. దీనిని కొమురం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించారు. దీనిని మే నెలలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి తగ్గట్టుగా జీవో 49 ని జారీ చేసింది.. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని 36- ఏ నిబంధన ఆధారంగా దీనిని కన్జర్వేషన్ రిజర్వు గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధన ప్రకారం స్థానికులతో సంప్రదింపుల అనంతరం అభయారణ్యాలు, వన్యప్రాణి రక్షిత ప్రాంతాలను రక్షించడానికి పరిరక్షణ రిజర్వ్ (కన్జర్వేషన్ రిజర్వ్) గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయి.
తీవ్రంగా వ్యతిరేకించిన గిరిజనులు..
అయితే, ఈ 49 జీవోను గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమతో ‘సంప్రదింపులు’ జరపకుండానే ఏకపక్షంగా జీవో జారీ చేశారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ రక్షణ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ‘పెసా’ చట్టం( PESA Act-1996) స్థానిక గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టిందని, అధికారులు వాటిని అమలు చేయడం లేదని, కనీసం గ్రామసభలు కూడా నిర్వహించలేదని, మాయమాటలు చెప్పి , దొడ్డి దారిన జీవో 49ను తెచ్చారని వారు చెబుతున్నారు. ఈ జీవోను తీసుకురావడాని కంటే ముందు స్థానికులతో ప్రభుత్వం సంప్రదింపు జరపాలి. అక్కడి ప్రాంతాలను పరిశీలించాలి. ఆ తర్వాత కన్జర్వేషన్ రిజర్వు గా ప్రకటించాలి.. అయితే ప్రభుత్వం ఇలా చేయకుండానే ఏకపక్షంగా కన్జర్వేషన్ రిజర్వు ప్రకటించిందని ఇక్కడ స్థానికులు దుయ్యబడుతున్నారు.
దశల వారీగా పోరాటాలు..
ఈ జీవో నిలిపివేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆదివాసీ సంఘాలు ప్రకటించాయి. అన్నట్లుగానే వివిధ రూపాల్లో వారు పోరాటాలు చేశారు. ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని జీవో 49 నిలిపివేయాలంటూ తీర్మానాలు చేశారు. ఆయా మండల కార్యాలయాలు, అటవీ శాఖ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలు అందించారు. ఇలా అనేక రూపాల్లో తమ నిరసనలు తెలియచేశారు. ఈ ప్రాంతానికి వచ్చిన ఇన్చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావును సైతం నిలదీశారు. మాజీ ఎంపీ, ఆదివాసీ సంఘాల ఉద్యమ నేత సోయం బాపూరావు (Soyam Bapurao), ఆదివాసీ సంఘాల నేతలు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ను కలిసి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.49ను రద్దు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ జీవో వల్ల ఆదివాసీల మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
మావోయిస్టు పార్టీ లేఖ..
మరోవైపు మావోయిస్టు పార్టీ సైతం అధికార ప్రతినిధి జగన్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీవో 49ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ జీవో ఉద్దేశం జంతువుల కోసం కాదని మోదీ, అమిత్ షా మానసపుత్రులైన అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ సంస్థల కోసమనేది అందరూ గమనించాలన్నారు. వేల సంవత్సరాలుగా అడవిని, అందులోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ జీవిస్తున్న మూలవాసులను అదే అడవికి దూరం చేసి, వారి జీవనాన్ని, సంస్కృతి సంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంతో కుమ్రంభీం, ములుగు, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటం నుంచి కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వెనక్కి తగ్గిన సర్కారు…
ఇలా చాప కింద నీరులా ఆదివాసీల ఆందోళన, దానికి పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో సర్కారు వెనక్కి తగ్గింది. జీవో 49 నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. జీవో 49 మీద ఆదివాసీలు, గిరిజనులకు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోక్యం చేసుకుని ఈ జీవో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారి ఆందోళన నివృత్తి చేసే వరకు జీవో అమలు నిలిపి ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో 49 మీద స్థానిక ఆదివాసీల్లో అనుమానాలు, అభ్యంతరాలు నెలకొన్న నేపథ్యంలో వాటిపై పలు దఫాలు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రులు సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ నుంచి మరొకసారి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజల్లో నెలకొన్న అనుమానాలా నివృత్తి చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమగ్ర వివరాలు సేకరించారు. స్థానిక ఆదివాసీల విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని నివేదించి జీవో 49 నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.