ఉపరాష్ట్రపతి రాజీనామా
Vice President resigns:ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్టు వెల్లడించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. 2022 జులైలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దన్ఖడ్ విజయం సాధించారు. అదే ఏడాది ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉన్నారు. రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానని, ఈ పదవిలో కొనసాగలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు.
1951 మే 18న రాజస్థాన్లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎబీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో సభ్యుడిగా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు.
జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది.