వాగులో చిక్కుకున్న మహిళా కూలీలు
కాపాడిన గ్రామస్థులు
Women laborers trapped in a stream:పొలం పనుల కోసం వెళ్లి వస్తుండగా మహిళ రైతు కూలీలు వాగులో చిక్కుకున్నారు. దీంతో వారిని గ్రామస్థులు తాళ్లు వేసి కాపాడారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల శివారులో నక్కల ఒర్రె పొంగి ప్రవహిస్తోంది. ఒర్రె దాటుతున్న కూలీలు వాగులోని నీటి ప్రవాహంలో చిక్కుకొని కాపాడమని అరుపులు వేయడం గమనించిన గ్రామస్తులు తాళ్లు వేసి మహిళా కూలీలను బయటికి తీశారు.
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన మహిళా కూలీలు శనివారం మల్యాల గ్రామంలో రైతుల వరి నాట్లు వేసేందుకు వచ్చారు. వరినాట్లు వేసి సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో మల్యాల నుంచి పోచంపల్లికి వెళ్లే దారిలో నక్కల ఒర్రె దాటేందుకు ప్రయత్నిస్తుండగా నీటిలో చిక్కుకొన్నారు. మహిళ కూలీలు అరవడం విని చుట్టు ప్రాంతాల రైతులు వెంటనే తాడు వేసి కూలీలను కాపాడారు.