అది హ‌ర్యానా దొంగ‌ల ప‌నేనా…?

-నేరం చేసిన తీరు వారి తీరేన‌ని పోలీసుల అనుమానాలు
-గ్యాస్ క‌ట్ట‌ర్లు, సీసీ కెమెరాల‌పై బ్లాక్ పెయింట్‌
-దొంగ‌త‌నాలు చేసే స‌మ‌యం కూడా అదే
-గాలింపు తీవ్ర‌త‌రం చేసిన ఆదిలాబాద్ పోలీసులు

వాళ్లు మామూలు దొంగలు కాదు.. వాళ్ల ల‌క్ష్యమే విభిన్నంగా ఉంటుంది.. నేరం చేసే తీరు… స‌మ‌యం ఇలా అన్ని ర‌కాలుగా చాలా ప‌క‌డ్బందీగా దొంగ‌త‌నాలు చేస్తారు.. గ్యాస్ క‌ట్ట‌ర్లు ఉప‌యోగిస్తారు.. సీసీ కెమెరాల‌పై బ్లాక్ పెయింట్ స్ప్రే చేసి దొంగ‌త‌నం ఆన‌వాళ్లు లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు. అదే హ‌ర్యానా దొంగ‌ల ముఠా… ఎన్నో ర‌కాలుగా పోలీసుల‌కు దొర‌క్క‌కుండా ఆ ముఠా ఏటీఎంల‌నే ల‌క్ష్యంగా చేసుకుని దొంగ‌త‌నాలు చేస్తుంది.. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జ‌రిగిన ఏటీఎం దొంగ‌తనం విష‌యంలో కూడా ఆ ముఠానే చేసుంటుంద‌ని పోలీసులు ప్రాథ‌మిక అంచాన‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం…

ఆదిలాబాద్ ఏటీఎం చోరీకి సంబంధించి పోలీసులు విచార‌ణ వేగ‌వంతం చేశారు. అస‌లు ఈ చోరీ ఎలా జ‌రిగింది…? వేలిముద్ర‌లు, ఇత‌ర ఆధారాలు సేక‌రించి దొంగ‌ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. అయితే, ఈ వ్య‌వ‌హారంలో పోలీసులు ఈ దొంగ‌త‌నం చేసింది ఎవ‌ర‌నేది ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దొంగ‌త‌నం చేసిన తీరు, స‌మ‌యం, ఇలా అన్ని ర‌కాలుగా ప‌రిశీలిస్తే హ‌ర్యానాకు చెందిన గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. గ‌తంలో ఏటీఎంల‌లో జ‌రిగిన చోరీలు, దొంగ‌త‌నం తీరు ఇలా అన్నింటితో హ‌ర్యానా గ్యాంగ్ చేసే దొంగ‌త‌నాల‌తో ప‌రిపోల‌డంతో పోలీసులు ఆ వైపుగా విచార‌ణ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

హ‌ర్యానా గ్యాంగ్ దొంగ‌త‌నాలు చేసే తీరిదే…
హ‌ర్యానా గ్యాంగ్ చేసే దొంగ‌త‌నాలు తీరే వేరేలా ఉంటుంది. వాళ్లు ఏ ఏటీఎం పడితే ఆ ఏటీఎంలో దొంగతనాలు చేయరు. కేవలం ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలలోనే ఎక్కువ‌గా చోరీలకు పాల్పడతారు. ఇటీవల తెలంగాణ‌, ఆంధ్రాప్రాంతాల్లో జరిగిన ఏటీఎం దొంగతనాల్లో ఎక్కువగా ఎస్‌బీఐకి సంబంధించినవే ఉంటున్నాయి. సాధారణంగా చోరీలకు బైకులు, కార్లు ఉపయోగిస్తే, వీళ్ళు ఏకంగా హర్యానా నుంచి కంటైన‌ర్‌తో వ‌చ్చి మ‌రీ దొంగ‌త‌నాలు చేస్తారు. మొద‌ట‌గా కంటైన‌ర్‌తో ఏదైనా లోడ్‌తో వ‌స్తారు. ఇక్క‌డ ఏటీఎంల భ‌ద్ర‌త‌, ఇత‌ర వ్య‌వ‌హారాల‌పై క‌న్నేస్తారు. ఏటీఎం కేంద్రాలను పరిశీలించి, వాటి దగ్గర భద్రత, సీసీ కెమెరాలు, ప్రజల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈజీగా చోరీ చేసేందుకు అనువైన ఏటీఎం కేంద్రాలను గుర్తిస్తారు. ముఖ్యంగా ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న వాటిపై దృష్టి పెడ‌తారు. దొంగ‌త‌నానికి అనువుగా ఉన్న వాటిని ఎంచుకుని వాటి ద‌గ్గ‌ర రెక్కీ నిర్వ‌హిస్తారు.

గ్యాస్ కట్టర్, గడ్డపారలు…
ఇలా గుర్తించిన ఏటీఎంల‌ను ర‌ద్దీ లేని స‌మ‌యంలో ముఖ్యంగా ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వచ్చిన పని పూర్తి చేస్తారు. హర్యానా నుంచి … ఏటీఎంలు పగలగొట్టి చోరీలకు పాల్పడతారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు కాకుండా సీసీ కెమెరాలకు బ్లాక్ కలర్ స్ప్రే చేస్తారు. గ్యాస్‌క‌ట్ట‌ర్లు, గ‌డ్డ‌పార‌ల‌తో ఏటీఎంను తెరిచి అందులో డ‌బ్బులు చోరీ చేస్తారు. చోరీ సంద‌ర్భంగా అలారం మోగ‌కుండా వైర్ల‌ను క‌ట్ చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జ‌రిగిన జ‌రిగిన ఏటీఎం చోరీ కూడా అచ్చు ఇలాగే జ‌రిగింది. కేవ‌లం ప‌న్నెండు నిమిషాల్లోనే రూ. 14.60 ల‌క్ష‌ల సొమ్ముతో దొంగ‌లు ఉడాయించారు. శ‌నివారం ఉద‌యం 3.03 నిమిషాల‌కు వ‌చ్చిన దొంగ‌లు 3.15 లోపు ప‌ని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు.

గాలింపు తీవ్ర‌త‌రం చేసిన పోలీసులు..
ఈ కేసును చాలెజింగ్‌గా తీసుకున్న ఆదిలాబాద్ పోలీసులు దొంగ‌ల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. ప‌లు బృందాలుగా విడిపోయి గాలింపు చేప‌ట్టారు. హ‌ర్యానాలోని మేవ‌ట్ ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. దొంగ‌త‌నం జ‌రిగిన త‌ర్వాత నిర్మ‌ల్ వైపు వెళ్లిన‌ట్టుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీల‌ను బ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లో దొంగ‌ల‌ను ప‌ట్టుకుని తీరుతామ‌ని పోలీసులు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like