సీతక్క కో ఆర్డినేటర్‌ను.. సీట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు
Cheating:మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయాల్లో సీట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మోసానికి గురైన బాధితులు విలేకరులను మంగళవారం ఆశ్రయించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కౌటాల, సిర్పూర్ మండలాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు మీ పిల్లలకు మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయాల్లో సీట్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. గతంలో ఒకరిద్దరికి సీట్లు ఇప్పటించడంతో అతడు చెప్పింది నిజమేనని నమ్మారు. మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల్లో సీటు ఇప్పిస్తానని ముందస్తుగా రూ. 10,000, ప్రవేశం పొందిన అనంతరం రూ .10,000 చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ముందస్తుగా విద్యార్థుల తల్లిదండ్రులు సీటు కోసం ఆ వ్యక్తికి రూ. 10,000 చెల్లించారు. ప్రశాంత్ సీటు ఇప్పించకపోగా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో బాధితులు విలేకరులను ఆశ్రయించారు.
మంత్రి కో ఆర్డినేటర్ అంటూ లేఖలు చూపించడంతో తాము నమ్మినట్లు బాధితులు వెల్లడించారు. ఆ లేఖలపై సీతక్క సంతకం ఉండటంతో అతన్ని పూర్తిగా నమ్మామని తెలిపారు. తాము వేరే పాఠశాలల నుంచి టీసీలు తీసుకువచ్చామని పిల్లలు స్కూళ్లకు వెల్లడం లేదన్నారు. పది రోజులుగా మొబైల్ స్విచ్ఆఫ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో కాగజ్‌నగర్‌లో ఉంటానని చెప్పడంతో తాము ఎంత గాలించినా దొరకలేదన్నారు. తమకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.