శ్రీ‌వారి ద‌ర్శ‌నంలో మార్పులు

Tirumala Darshan Timings Changed:తిరుమల శ్రీవారి భక్తుల ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుమ‌ల తిరుమ‌ల దేవ‌స్థానం కీల‌క‌మైన మార్పు చేసింది. రేప‌టి నుంచి తిరుమలలో ప్రయోగాత్మకంగా దీనిని అమ‌లు చేయ‌నున్నారు. ఆగ‌స్టు 1 (శుక్రవారం) నుంచి 15తేదీ వరకు ఈ నూతన విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు ఆఫ్ లైన్(off line)లో పొంది శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం వారి ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్న‌ట్లు టీటీడీ అద‌నపు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలిపారు. ప్రస్తుత విధానం వలన శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల సమయం ప‌డుతోంది. భ‌క్తుల కోసం దీనిలో మార్పులు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఏ రోజు కా రోజు టికెట్ జారీతో పాటు దర్శనం కల్పించ‌నున్నారు. తిరుమ‌ల‌లో ఉద‌యం 10 గంట‌ల నుండి మొద‌ట‌ వ‌చ్చిన వారికి మొద‌టి ప్రాతిప‌దిక‌న టికెట్ల‌ జారీ చేస్తారు. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వ‌ద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు రిపోర్టింగ్ చేయాలి. రేణిగుంట విమానాశ్ర‌యంలో ఉద‌యం 7 గంట‌ల నుండి ద‌ర్శ‌న టికెట్లు కోటా ఉన్నంతవరకు జారీ చేస్తారు. య‌థావిధిగా తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్ర‌యంలో 200 టికెట్లు జారీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబ‌ర్ 31వ తేది వ‌ర‌కు ఆన్ లైన్ (online)లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తారు. న‌వంబ‌ర్ 1 నుంచి శ్రీ‌వాణి టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించ‌నున్నారు.

భ‌క్తులు ముందుగా కౌంట‌ర్ల వ‌ద్ద‌కు చేరుకుని తాము ఇబ్బంది ప‌డ‌కుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేసే ప్రదేశం వద్దకు చేరుకోవాలని అధికారులు కోరారు. ఈ నూతన విధానం తో భక్తులు శీఘ్రంగా అంటే వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని వారు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like