తిరుమలలో రీల్స్ చేస్తే జైలుకే..
Tirumala :పరమపావన పుణ్యక్షేత్రం.. కోట్లాది మందికి పరమ పావన దివ్యక్షేత్రం.. అదే తిరుమల.. ఆ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మధన్యం అవుతుందనేది భక్తుల భావన.. అయితే, కొందరికి ఇవేమీ పట్టవు.. తమ దారి తమదే.. తమ లోక తమదే.. అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) హెచ్చరికలు చేసింది… భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా చేస్తే కేసులు పెడతామని హెచ్చరించింది.
తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తారు. భక్తిభావంతో స్వామి వారిని దర్శించుకుని ఆధ్యాత్మిక భావంతో మునిగి తేలుతారు. అయితే కొందరు మాత్రం తాము చేసే ప్రతి పని సోషల్ మీడియాలో పెట్టి బాగు పేరు సంపాదించుకోవాలని కలలు కంటున్నారు. దానికి ఈ పుణ్యక్షేత్రాన్ని సైతం వేదికగా వాడుకుంటున్నారు. తిరుమలలో అసభ్యకరమైన నృత్యాలు చేస్తూ వాటిని రీల్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తిరుమలలో ఎంత కట్టుదిట్టం చేసినా.. కొంత మంది ఆకతాయిలు కావాలని ఇలాంటి అసభ్యకరమైన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒక్కెత్తు అయితే, తిరుమాడ వీధుల్లో సైతం ఇలాంటి వాటిని చేస్తూ ఆనందం పొందుతున్నారు.
ఇలాంటి వాటిపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దృష్టి పెట్టింది. ఆలయం ముందు, మాడవీధుల్లో ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని టీటీడీ పేర్కొంది. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని స్పష్టం చేసింది. ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కావాలని సూచించింది.క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని టీటీడీ తెలిపింది.