ముఖ్యమంత్రి చేతికి కాళేశ్వరం నివేదిక
Kaleshwaram report handed over to Chief Minister:కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)కు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ (PC Ghose Commission Report) ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి ఈ నివేదిక అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ నివేదికను ముఖ్యమంత్రికి అందచేశారు.
నివేదిక అధ్యయానికి ఉన్నత స్థాయి కమిటీ…
కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర మంత్రిమండలికి సమర్పించనుంది.