సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ముఖ్యమంత్రిని కలిసిన INTUC సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్
INTUC Secretary General Janak Prasad met the CM Revanth Reddy:సింగరేణి కార్మికుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని INTUC సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ముఖ్యమంత్రితో సింగరేణికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా మారుపేర్ల మార్పిడి, సొంతింటి కలను నెరవేర్చడం, పేర్క్స్ మీద ఇన్కమ్ టాక్స్ మాఫీ, కార్మికులు, సూపర్వైజర్ల ఆశలను అడియాసలు చేస్తున్న మెడికల్ బోర్డును ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి భారీగా లాభాలను గడించిందని కార్మికులకు వెంటనే 35 శాతం లాభాల వాటాను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులు కృషి ఎంతో ఉన్నదన్నారు. ముఖ్యమంత్రిగా మీపై కార్మికులోకానికి ఎంతో విశ్వాసం ఉన్నదని వారి సమస్యలను త్వరగా తీర్చాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికుల సమస్యలను తీర్చడం తన బాధ్యతన్నారు. త్వరలోనే ఇంధన శాఖ మంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రితో సింగరేణికి సంబంధించిన అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల సమస్యలు తీర్చేలా తాను కృషి చేస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా జనక్ ప్రసాద్‌కు హామీ ఇచ్చారు.