హెచ్ఎంఎస్ నేతతో కవిత భేటీ
-సింగరేణిలో కలిసి పనిచేసేలా వ్యూహం
-నల్లనేల నుంచే సమరశంఖం పూరించేందుకు సిద్ధం
-ఈ నెల పదవ తేదీన HMS, సింగరేణి జాగృతి చర్చలు
Kalvakuntla Kavitha:HMS యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సింగరేణి కార్మిక నేత రియాజ్ అహ్మద్ తో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ అవడం కలకలం రేపుతోంది. ఈ సమావేశం రహస్యంగా సాగినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలు బయటకు పొక్కాయి. రియాజ్ అహ్మద్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో కలుసుకుని సింగరేణి కార్మికుల సమస్యలు, హక్కుల రక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ జాగృతి సంస్థతో హెచ్ఎంఎస్ కలిసి పని చేసే అంశంపై దృష్టి సారించారు. ఈ విషయమై రియాజ్ అహ్మద్ నాంది న్యూస్‌తో మాట్లాడుతూ చర్చలు జరిగిన విషయాన్ని అంగీకరించారు. కవితక్కతో ఇరువురు కలిసి పనిచేసే విషయంలో సానుకూల వాతావరణంలో చర్చించినట్లు చెప్పారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, కాంట్రాక్ట్ కార్మికుల పునర్నిర్మాణ హక్కులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజులుగా కవిత కొత్త పార్టీవైపు మొగ్గు చూపుతోందనే ప్రచారం కొనసాగుతోంది. ఈ సమయంలో కవిత తనకు ఆది నుంచీ పట్టున్న సింగరేణిపై దృష్టి సారించారు. ఆమె కొద్ది రోజుల కిందట సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి, కోఆర్డినేటర్లను కూడా నియమించారు. అదే సమయంలో సింగరేణి కార్మికసంఘ నేతలతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. అయితే, అదే సమయంలో బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అనుబంధంగానే సింగరేణి జాగృతి కూడా పనిచేస్తుందని కవిత ప్రకటించారు. అయితే, టీబీజీకేఎస్ ఉన్నా కొత్త సంఘాన్ని ఎందుకు స్థాపించారనే ప్రశ్నలు కార్మిక వర్గంలో వెల్లువెత్తాయి.
సింగరేణిలో తన పట్టు నిలుపుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనలో భాగంగానే కవిత ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత తన మొదటి పర్యటన సింగరేణి ప్రాంతంలో పెట్టుకుని తన వెంట వచ్చేదెవరు..? బలాబలాలు ఇలా అంచనా వేసిన కవిత సింగరేణి నుంచే తాడోపేడో తేల్చుకునేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఎంఎస్ నేతలతో మంతనాలు చేసి కలిసి పనిచేసేలా వ్యూహం రూపొందిచారు. ఈ నెల 10న హెచ్ఎంఎస్ నేతలు, సింగరేణి జాగృతి నేతలు కలిసి భవిష్యత్ ప్రణాళిక రూపొందించనున్నారు.