ఆ నేతలు – పైసల వసూళ్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిపక్ష నేతలకు కలిసివచ్చాయి. ఓ వైపు అభ్యర్థి ఎంపిక, నామినేషన్లు వాటి విత్ డ్రా విషయంలో అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం ఈ ఎన్నికలు ఎంజాయ్ చేశారు. ఆర్థికంగా తమకు ఈ ఎన్నికలు కలిసిరావడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం తమ వారితో నామినేషన్లు వేయించి డబ్బులు దండుకోవడం మరో ట్విస్ట్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోయాయి. మరోవైపు క్యాంపు రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. అయితే ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తమ అనుచరులతో నామినేషన్లు వేయించారు. ఎలాగైనా ఓడగొట్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మీసాలు మెలేశారు.. కానీ అసలు విషయానికి వస్తే మాత్రం చల్లబడిపోయారు. ఉన్నదేమిటని ఏమిటని ఆరా తీస్తే ఎన్నో షాకింగ్ విషయాలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తమకు సరైన బలం లేదని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ భావించాయి. అభ్యర్థులను నిలబెట్టి పరువు పోగొట్టుకోవడం కంటే అసలు అభ్యర్థులనే నిలబెట్టవద్దని ఆయా పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం కాస్తా స్థానిక నేతలకు కలిసివచ్చింది. నాలుగు జిల్లాల్లో స్థానిక నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపారు. వాళ్లతో నామినేషన్లు వేయించారు. అధికార పార్టీ ఓటమే లక్ష్యమని వెనక్కి తగ్గేదేలేదని ప్రచారం చేసుకున్నారు. అందరి మద్దతు కూడగట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొడ్తామని స్పష్టం చేశారు.
అయితే చివరికి వచ్చే సరికి సీన్ మారింది. వారి అసలు లక్ష్యం బయటపడింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు కొందరు తమ వారికి చెందిన నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. ఒకరిద్దరు మినహా చాలా మంది నేతలు డబ్బులు డిమాండ్ చేసి మరీ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వ్యక్తులు వారి వెనక ఉన్న నేతలను బట్టి ఒక్కొక్కరికి పది నుంచి ఇరవై లక్షల వరకు పంపిణీ చేసినట్లు ఆ పార్టీకి చెందిన నేతలే ఆరోపిస్తుండటం గమనార్హం. చివరి రెండు, మూడు రోజులు ఈ రేటు పలకగా నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. ఒకరిద్దరు నేతలు తమ అనుచరుల పేరు చెప్పి కోట్లు వెనకేసున్నారని సమాచారం.
– పశ్చిమ జిల్లాకు చెందిన నేత ఒకరు తన అనుచరుడితో నామినేషన్ వేయించారు. చివరి రోజు వరకు నామినేషన్ ఉపసంహరించుకోలేదు. ఓ పెద్దాయన చెబితే వింటాడనుకుని అతని వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు పరుగులు పెట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం నుంచి బేరసారాలు మొదలయ్యాయి.
– మధ్యాహ్నం 12.30కి రూ. 10 లక్షలకు ధర పలికింది. అది కుదరదు… బరిలో నిలవడం ఖాయమని ఆ నేత హెచ్చరికలు జారీ చేశారు. 1.30కి 25 నుంచి 30 లక్షలకు బేరం పెరిగింది. 2 గంటలకు 30 నుంచి 50కి పెరిగింది. అయినా ఆ నేత వెనక్కి తగ్గలేదు. అందరిలో టెన్షన్ మొదలైంది. అప్పటికి దాదాపుగా అందరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో మిగిలేది మావోడు ఒక్కడే అని భయపెట్టారు. ఇస్తే కోటి లేదంటే పోటీ అని భయపెట్టారట. కోటి అయినా పర్వాలేదు.. ఎంతైనా ఇద్దామని ఒక శాసనసభ్యుడు చెప్పడంతో మొత్తానికి 2.40 గంటలకు డీల్ ఫిక్స్ అయ్యింది. అందులో పది లక్షల వరకు తన అనుచరుడికి ముట్టచెప్పిన ఆ నేత మిగతా మొత్తం తానే తీసుకున్నట్లు తెలుస్తోంది.
– అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో ఆ నేత సొంత పార్టీ వారే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన విత్ డ్రాకు కోటి తీసుకున్న నాయకుడు ఎవరంటూ మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వారి వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆ నేత ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నారు.
– మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఒక మండలానికి చెందిన జడ్పీటీసీ తన మండల పరిధిలో ఒకరితో నామినేషన్ వేయించారు. రాయబారం అంతా జడ్పీటీసీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో బేరం కుదిరింది. అధికార పార్టీతో మాట్లాడుకుని నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇందులో రూ. 20 లక్షలు చేతులు మారాయి.
– తూర్పు జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పే ఒక ప్రతిపక్ష పార్టీ నేత సైతం అనుచరుల చేత నామినేషన్లు వేయించారు. వారందరినీ గంప గుంతగా మాట్లాడుకుని నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంట్లో సైతం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.
– ఒక పెట్రోల్‌బంక్ వేదికగా దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం నడిచినట్లు సమాచారం. అక్కడి నుంచే కావాల్సిన వారికి డబ్బులు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేత ఒకరు ప్రతిపక్ష పార్టీ నేతతో మంతనాలు జరిపి బేరం తెగ్గొట్టారు.
– ఇదంతా ఒక్కెత్తు కాగా అధికార పార్టీకి చెందిన వారు సైతం నామినేషన్లు వేశారు. వారు కూడా నామినేషన్ల ఉపసంహరణకు డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాని వెనక కూడా కొందరు నేతలు ఉండి అంతా నడిపించినట్లు సమాచారం.
– ఒక ఎమ్మెల్యే తన అనుచరుడికి తక్కువగా ఇస్తున్నారని అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని భయపెట్టి మరీ ఎక్కువ మొత్తంలో ముట్టచెప్పేలా చూశారు.
– ఈ ఎపిసోడ్ మొత్తం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా కేటీఆర్ పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు చేతుల మారిన వ్యవహారంలో తమ పార్టీ నేతలే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం పట్ల సీరియస్ అయినట్లు సమాచారం.