బతికుండగానే చంపేశారు..
ఓ వృద్ధురాలి పేరిట భూమి ఉంది.. దానిపై కొందరి కన్ను పడింది.. ఇంకేముంది, దానిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఏకంగా ఆ వృద్ధురాలు చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి ఆ భూమిని కాజేశారు.. వివరాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో ఉన్న వృద్ధురాలికి అదే గ్రామంలో భూమి ఉంది. దానిని కొందరు తాను చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమిని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆ వృద్ధురాలు సోమవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది. బిడ్డలతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లకు విన్నవించింది ఆ వృద్ధురాలు. తనకు అన్యాయం చేశారని, కొందరు అధికారులు వారికి వంత పాడుతున్నారని వాపోయింది. దీంతో తగిన న్యాయం చేస్తానని సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల హామీ ఇచ్చింది. దీంతో ఆ వృద్ధురాలు ధర్నా విరమించింది.