సింగరేణి పైపుల లొల్లి..
Singareni:సింగరేణిలో ఓ అధికారి ఇచ్చిన పైపులు లొల్లికి దారి తీస్తున్నాయి. ఆ వ్యవహారంలో పరిస్థితి కాస్తా సీరియస్ అవడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లిలో వినాయకుడి మంటపం వేసేందుకు ఓ అధికారి దాదాపు 18 పైపులు ఇచ్చారు. తాము షెడ్డు వేస్తున్నామని పైపులు కావాలంటూ ఓ నాయకుడు మందమర్రి ఏరియా సింగరేణి అధికారులకు ఫోన్ చేయడంతో వారు పైపులు పంపించారు. అయితే,ఈ వ్యవహారం కాస్తా రచ్చరచ్చ అవుతోంది. బెల్లంపల్లి వార్డు నంబర్ 21లోని ఓ ప్రభుత్వ భూమిలో ఈ వినాయక మంటపం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ షెడ్ కట్టవద్దంటూ కొందరు అడ్డుకుంటున్నారు. ఆ షెడ్ పేరిట స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అయితే, దీనికి సంబంధించి పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల నుంచి ఎన్‌వోసీ తీసుకోలేదని, ఇక్కడ షెడ్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో కొందరు అధికారుల దృష్టికి సైతం ఈ సమస్యను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భూమిలో షెడ్ నిర్మించుకునేందుకు సింగరేణి పైపులు ఎలా ఇస్తారంటూ ఆ సింగరేణి అధికారులకు ఫోన్లు వెళ్లాయి. కొందరు ఫోన్లు చేసి నిలదీశారు. ఆ పైపులు ఇవ్వడం వల్లనే షెడ్ వేస్తున్నారని అనడం, వరుసగా ఫోన్లు వెళ్లడంతో సింగరేణి అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
బెల్లంపల్లిలో 34 వార్డులు ఉన్నాయని అధికార పార్టీకి చెందిన నాయకులకు పైపుల విషయంలో ఒత్తిళ్లు ఉన్నాయని, తమకు పైపులు కావాలంటూ సింగరేణి అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. తమ అధికార పార్టీకి నేతలకు కూడా ఖచ్చితంగా పైపులు ఇవ్వాలని జీఎం కార్యాలయ అధికారులకు, సివిల్ డిపార్ట్‌మెంట్ అధికారులపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఇస్తే మాకు ఇవ్వండి.. లేదంటే ఆ పైపులు వెనక్కి తీసుకోండి.. అంటూ మరికొందరు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక సింగరేణి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మరి చివరకు ఈ వ్యవహారం ఎక్కడికి వెళుతుందో చూడాలి మరి…