పేకాట రాణుల అరెస్టు
Poker queens arrested:ఇప్పటిదాకా మగాళ్లు పేకాట క్లబ్బుకు వెళ్లి పాడైపోతున్నాడనే మాట వినేవాళ్లం.. ఇకనుంచి ఆ మాట ఆడవాళ్లకు కూడా వర్తిస్తుందని తేలతెల్లం అవుతోంది. కింగ్ పోయి క్వీన్ వచ్చే అన్న రీతిలో మహిళల పేకాట సాగుతోంది. కేవలం వినోదం కోసం ఆడిదే ఏ గొడవా లేదు. కానీ, బెట్టింగ్‌లు పెట్టి మరీ పేకాట ఆడేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోయిందని ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు దీనిని నిరూపిస్తున్నాయి.
విశాఖపట్నంలో జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. లలితానగర్ ప్రాంతంలో కొందరు మహిళలు జూదం ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నాలుగో పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి దాడి చేసి ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి రూ. 22 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మహిళలు తరచూ పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు చేసింది ఓ మహిళ భర్తనే…
తన భార్య కొంతకాలంగా మహిళలు పేకాట ఆడుతున్నట్లు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భార్య రోజూ జూదం ఆడుతున్నట్లు పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో, ఆయనే పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. నాలుగో పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఈ పేకాట ఎపిసోడ్ స్థానికంగా సంచలనంగా మారింది. ఆడవాళ్లు పేకాట ఆడటం కామన్ అనుకున్నా.. వారిలో ఒకరి భర్త ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. నాలుగు రోజుల కిందట పెడన 1వ వార్డు పైడమ్మ లేఔట్లో నడుస్తున్న మహిళల జూద శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రూ. 12,350 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు మహిళల అరెస్టు.. ఏడు లక్షలు స్వాధీనం..
విశాఖపట్నంలో కొద్ది రోజుల కిందట కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కొంతకాలంగా ఒక బిల్డింగ్‌లో మినీ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మహిళలతో లక్షల్లో పేకాడిస్తున్న ఒక నిర్వాహకురాలి గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓ అపార్ట్ మెంట్ లో మహిళల చేత మహిళల కోసమే ఒక పేకాట క్లబ్ నడుస్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేసి మరీ ఆ స్థావరాన్ని చేధించారు. పాలడుగు రాజేశ్వరి (55) అనే మహిళ పేకాట ఆడుతూ దానికి బానిసై తానే పేకాట శిబిరం నిర్వహకురాలిగా అవతారమెత్తింది. ఈమె కొంతకాలంగా గురునానక్ కాలనీలోని న్యాక్ కళ్యాణ మండపం సమీపంలో కెఎస్ఎన్ క్లాసిక్ అపార్ట్మెంట్లో ఈ ఉమెన్స్ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాడుతూ పట్టుబడిన ముగ్గురు మహిళలతో సహా మొత్తం 21మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఏడు లక్షల 32వేల 100 రూపాయలు నగదు, ఏడు మోటారు సైకిళ్ళు, 23సెల్ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.