దొంగతనం కేసు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

-నిందితుడి అరెస్ట్.. సొత్తు స్వాధీనం
-సీసీ కెమెరాల ప్రాముఖ్యతను చాటిచెప్పిన ఘటన
-ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ పిలుపు

దొంగతనం జ‌రిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించడ‌మే కాకుండా, నిందితున్ని అరెస్టు చేసి సొత్తు సైతం స్వాధీనం చేసుకున్నారు ఖాకీలు.. సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే కేసుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు వీలుంటుంద‌ని దానికి ఈ దొంగ‌త‌న‌మే ఉదాహ‌ర‌ణ అంటూ పోలీసులు చెబుతున్నారు. కాల‌నీలు, గృహాల్లో ఖ‌చ్చితంగా సీసీ కెమెరాలు బిగించుకోవాల‌ని పిలుపునిస్తున్నారు.

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని పద్మావతి కాలనీకి చెందిన మేకల రాజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8వ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు. రాత్రి ప‌డుకుని తెల్లవారే స‌రికి చూడ‌గా, బ్యాగులో ఉంచిన సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. దీంతో బాధితుడు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో దర్యాప్తును ముమ్మరం చేశారు. మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, సీసీఎస్ ఎస్ఐలు మధుసూదన్, లలిత సిబ్బందితో కలిసి నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

బంగారం అమ్మేందుకు వెళ్తుండ‌గా ప‌ట్టుబ‌డి…
దర్యాప్తులో భాగంగా, దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, ఓ వ్య‌క్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ రోజు (ఆదివారం) అమ్మా గార్డెన్ ఏరియాలోని సీసీ ఫుటేజీల్లో సైతం అదే వ్యక్తి అక్కడ కనిపించడంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, బృందాలు అతడిని చాకచక్యంగా పట్టుకున్నాయి. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, దొంగిలించిన బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. విచారణలో నిందితుడు పద్మావతి కాలనీలో దొంగతనం చేసినట్లు అంగీకరించిన‌ట్లు వెల్ల‌డించారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపాడు.

ప్రతి ఇంటికి సీసీ కెమెరా తప్పనిసరి – ఏసీపీ రవికుమార్
బెల్లంప‌ల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ నిందితుడు జాడి సురేష్ రాజీవ్ నగర్, మంచిర్యాలలో ఉంటాడ‌ని, అత‌నిపై ఇప్ప‌టికే ఐదు కేసులు ఉన్న‌ట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ కేసును ఇంత త్వరగా ఛేదించడంలో సీసీ కెమెరాల ఫుటేజ్ అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. నేరాల నియంత్రణలో, నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో సహాయపడతాయని, నివాస గృహాలు, వ్యాపార సంస్థల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

పోలీసుల‌కు రివార్డులు అందించిన ఏసీపీ..
కేసును 24 గంటల్లో ఛేదించి, అత్యంత ప్రతిభ కనబరిచిన మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, సీసీఎస్ ఎస్ఐలు మధుసూదన్, లలిత, హెడ్ కానిస్టేబుళ్ళు హేమసుందర్, సత్తయ్య, సిబ్బంది జంగు, రాము,రాజేశ్వర్ రావు, వెంకటేష్, రాకేష్, మహేష్, సీసీఎస్ కానిస్టేబుళ్ళు సతీష్, శ్రీనివాస్‌లను ఏసీపీ రవికుమార్ ప్రత్యేకంగా అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like