సింగరేణిని అవినీతి గనిగా మర్చారు
Kalvakuntla Kavitha about Singareni:కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సింగరేణి మొత్తం అవినీతికి ఒక గనిగా మారిపోయిందని సింగరేణి జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి తెలంగాణకు కొంగు బంగారమని, బొగ్గుబాయి నాడు పట్టేడు అన్నం పెట్టిందన్నారు. సింగరేణి తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన వరం. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసన్నారు. నేడు సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని, తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో భూగర్భ గనులు ప్రారంభించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ గనులతో పెద్ద, పెద్దవాళ్లకు లాభం జరుగుతుందన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తామని సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు గత సంవత్సరం 33 శాతం బోనస్ ఇచ్చారు. ఈసారి దసరాకు కార్మికులకు 37 శాతం సింగరేణి యాజమాన్యం బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి మెడికల్ బోర్డులో 54 మందిని సిక్ లిస్ట్ లో ఉంచారు. మెడికల్ బోర్డుకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారికి ఇవ్వాలన్నారు. సింగరేణి కార్మికులకు స్వంత ఇంటి కల కోసం మనం పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు.
తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని, హెచ్ఎంఎస్‌తో కలిసి సింగరేణి జాగృతి పని చేస్తుందని కవిత ప్రకటించారు. దసరా తర్వాత సింగరేణి బొగ్గుగనుల ప్రాంతంలో తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ సంయుక్తంగా ఒక జాగృతి యాత్ర నిర్వహించనున్నట్లు కవిత వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నింపడం, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు ఈ యాత్ర ఒక బలమైన వేదికగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.