మోదీ కానుక… తగ్గనున్న జీఎస్టీ పన్ను రేట్లు
PM Modi Announces GST Reforms:ఈసారి దేశ ప్రజలకు డబుల్ దీపావళి వేడుకలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేను దీపావళికి గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నా. 8సంవత్సరాలుగా మేం జీఎస్టీలో ఎన్నో సంస్కరణలు చేశాం. పన్ను సరళీకరించాం. ఇప్పుడు దీనిని సమీక్షించాల్సి ఉంది. కొత్త తరం జీఎస్టీ (వస్తు, సేవలపన్ను) సంస్కరణలు ఉంటాయని స్పష్టం చేశారు. రోజువారీ వినియోగించే పలు రకాల వస్తువులపై (నిత్యవసరాలపై) పన్నురేట్లు తగ్గిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలతో మాట్లాడాం. ఇప్పుడు కొత్త తరం జీఎస్టీ సంస్కరణల్ని తీసుకువస్తున్నామని మోదీ అన్నారు.
సంస్కరణల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటుతో GST సంస్కరణలు తెస్తామని.. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. మనం సృష్టించిన UPI ప్రపంచంలో మనశక్తిని చాటుతోందని అన్నారు. భారతదేశ సంపద బయటకు ఎందుకెళ్లాలని.. ప్రతిరంగంలో మనమే అప్లికేషన్లు తయారుచేసుకుందాం అని పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఫార్మా కేపిటల్‌గా భారత్‌కు పేరుందని అన్నారు. వ్యాక్సిన్ల తయారీలోనూ మనం సత్తా చాటుతున్నట్లు చెప్పారు. ఇది ఐటీ యుగం.. ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి AI వరకు అన్నీ మనవే కావాలని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను- GST) అతిపెద్ద సంస్కరణగా చెప్పొచ్చు. కేంద్ర, రాష్ట్రాలు వేర్వేరుగా విధిస్తున్న బహుళ పన్నుల స్థానంలో ఒకే పన్నుగా జీఎస్టీని 2017, జులై 1న ప్రవేశపెట్టారు. అంటే వస్తు, సేవలపై దేశమంతా ఒకే విధంగా విధించే పరోక్ష పన్నే జీఎస్టీ. ఇప్పుడు జీఎస్టీనే రాష్ట్రాలకు, కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం జీఎస్టీ కింద పన్ను రేట్లు 0, 5, 12, 18, 28 శాతాలుగా శ్లాబులు ఉన్నాయి. ప్రతి నెలలో జీఎస్టీ వసూళ్లు స్థిరంగా రూ. 1.8 లక్షల కోట్లపైనే నమోదవుతున్నాయి. జులైలో రూ. 1.96 లక్షల కోట్ల వసూళ్లు రాగా ఏప్రిల్లో అత్యధికంగా రూ. 2.37 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు వచ్చాయి.