యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

యూరియా అక్ర‌మ ర‌వాణా చేసే వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చ‌రించారు. ఆయ‌న మంచిర్యాల క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్‌తో క‌లిసి కోటపల్లి మండ‌లం రాపనపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. చెక్ పోస్ట్ లో పోలీస్ సిబ్బందితో పాటు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది 24/7 నిరంతరం పక‌డ్బందీగా అప్రమత్తంగా ఉండాల‌న్నారు. ఈ చెక్ పోస్ట్ వద్ద రెండు రోజుల కింద‌ట యూరియా అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకొని ఓ కేసు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, పోలీస్, ఇతర శాఖల అధికారులతో టాస్క్​ఫోర్స్ బృందాలను నియమించిన‌ట్లు వెల్ల‌డించారు. ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచిన‌ట్లు చెప్పారు. రైతుల‌కు యూరియా అందించే కేంద్రాల వద్ద కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

యూరియా, ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వాహనా తనిఖీ సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ పరిశీలించడంతోపాటు వాహన తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వుంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఎరువుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా రవాణా చేస్తే ఖ‌చ్చితంగా కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. సీపీ వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్సై రాజేందర్, ఇతర శాఖ ల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like