కాళేశ్వ‌రం నివేదిక‌పై కోర్టుకు వెళ్లిన కేసీఆర్

Kaleshwaram Report:కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నివేదిక‌పై కేసీఆర్ కోర్టుమెట్లు ఎక్కారు. జ‌స్టిస్ చంద్ర‌ఘోష్ క‌మిష‌న్ (Justice Chandra Ghose Commission) విష‌యంలో అటు కేసీఆర్‌, ఇటు హ‌రీష్‌రావు రెండు వేర్వేరు రిట్ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. కమిషన్‌ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్ర‌స్తుతం ఈ పిటిష‌న్ హైకోర్టు రిజిస్ట్రీ ప‌రిధిలో ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్‌, హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్‌ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మాణ లోపాలు, విధానపరమైన లోపాలు, పరిపాలనా నిర్ణయాలలో ఉల్లంఘనలు సహా సమగ్రంగా అధ్యయనం చేయడానికి నియమించిన కాళేశ్వరం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్‌ కొన్ని రోజుల కింద‌ట‌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక‌ సమర్పించింది. ఆ తర్వాత సీఎం రిపోర్ట్‌పై ప్రాథమిక చర్చ జరిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ బరాజ్ నిర్మాణంలో వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయని పీసీ ఘోష్ కమిషన్ తన నివేదిక‌లో పేర్కొంది. ప్రభుత్వంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు తప్పిదాలు కనిపించాయని తెలిపింది. నియమాలను పక్కనబెట్టి పనులను వ్యక్తుల ఇష్టానుసారం చేసినట్టు కమిషన్ భావించింది. ఇంజినీరింగ్, నిర్మాణ స్థాయిలోని నిర్ణయాలు టాప్ అధికారుల, రాజకీయ బాసుల ఒత్తిడితో తీసుకున్నాయని పేర్కొంది. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ (DPR) సిద్ధం దశ నుంచే ఉల్లంఘనలు కనిపించాయని స్పష్టం చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like