కవితక్క కష్టపడి పనిచేస్తే.. మీరిచ్చే బహుమతి ఇదా..?
Resignation from TBGKS:కవితక్క పదేండ్ల పాటు కార్మికుల కోసం ఎంతో కృషి చేశారు… ఎన్నో హక్కులు సాధించేందుకు ముందు నిలబడ్డారు.. రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మికుల మధ్య వారధిలా పనిచేశారు. కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించి కార్మికుల సమస్యలు పరిష్కరించారు.. ఇంత కష్టపడ్డందుకు మీరిచ్చే బహుమతి ఇదా..? అంటూ TBGKS కేంద్ర కోశాధికారి వెంకటేష్ ప్రశ్నించారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కవితక్కను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా తొలగించడాన్ని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నో సేవలందించిందని స్పష్టం చేశారు.
TBGKS గౌరవ అధ్యక్షురాలుగా పది సంవత్సరాలు ఉన్న కవితక్కని జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకుండానే గౌరవ అధ్యక్షురాలిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కవితక్క గౌరవ అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టే.. సింగరేణిలో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. కేసీఆర్‌తో మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి కేవలం కవితక్క మాత్రమేనని స్పష్టం చేశారు. కవితక్క కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించి సుప్రీంకోర్టులో కొట్టేసిన వారసత్వ ఉద్యోగాలని కారుణ్య నియామకాల పేరిట ఇప్పించారని గుర్తు చేశారు. సింగరేణిలో 19,463 నూతన ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కవితక్కదని వెంకటేష్ స్పష్టం చేశారు.
గృహరుణం పదిలక్షలపై వడ్డీ చెల్లింపు, ఉచిత విద్యుత్, ఉచిత ఏసీ సౌకర్యం, పదిరెట్లు మ్యాచింగ్ గ్రాంట్, ఉన్నత విద్యలో ఫీజు రియంబర్స్మెంట్, అంబేద్కర్ జయంతి సెలవు దినం, సంక్రాంతి, రంజాన్ క్రిస్మస్ ఆప్షనల్ సెలవు దినాలు, కార్మికుల తల్లిదండ్రులకి ఉచిత కార్పొరేట్ వైద్యం, ఎంఎంసీ 25 లక్షలకు పెంపు ఏక మొత్తంలో చెల్లింపు, క్యాడర్ స్కీం అమలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అందించడంలో కవితక్క పాత్ర ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కార్మికుల మధ్య వారిధిగా కేసీఆర్ గారితో మాట్లాడి ఒప్పించి ఇచ్చారని స్పష్టం చేశారు.
ఇంత అద్భుతంగా గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసిన కవితక్కకి మీరు ఇచ్చిన బహుమతి ఇదా..? అని ప్రశ్నించారు. కవితక్క ఆధ్వర్యంలో బాయి బాట కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో భువనచంద్ర రాకేష్ , అనిల్, హరీష్, మనోజ్, హరి, రవి, శ్రీకాంత్ రెడ్డి, విష్ణు, గణేష్, హఫీజ్, నవీన్ రెడ్డి, పృద్వి, నిశాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.