ఘనంగా బడగ పండుగ…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం బడగ పండుగను వైభవంగా జరుపుకున్నారు. పొలాల అమావాస్య రోజున ఉపవాస దీక్షలు చేసి తర్వాత రోజు బడగ పండగను నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. బడగ పండగను పురస్కరించుకుని ఇండ్లలో పిండి వంటలు చేసుకుని బంక మట్టితో ఎడ్లను తయారు చేసి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి దీక్షలను పూర్తి చేశారు. అనంతరం మట్టి ఎడ్లను గంపలలో డప్పుచప్పుళ్లతో వెళ్లి స్ధానిక చెరువులో నిమజ్జనం చేశారు.
వాస్తవానికి ఈ పండుగ నేతకాని మహర్ కులస్తులు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అమవాస్య రోజున గ్రామ పొలి మేరల నుంచి తెచ్చిన మట్టితో బసవన్నల ప్రతిమలు చేసి పూజించి మరుసటి రోజు నిమజ్జనం చేస్తారు. మిగతా మట్టితో గురుగులు చేసి వాటిలో పెరుగు తోడేసి మహిళలు మరో రెండు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తాండూరు మండలం కొత్తపల్లిలో ఈ పండుగ వైభవంగా నిర్వహించారు. తరతరాలు వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని నేతకాని మహర్ కుల పెద్ద పెరుగు లింగమూర్తి స్పష్టం చేశారు.