కాగజ్‌నగర్‌లో చోరీ…. కాజీపేటలో పట్టివేత..
కాగజ్‌నగర్‌లో చోరీ చేసి రైలులో పారిపోతున్న మహిళలను కాజీపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బ్రహ్మనందం నగల దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. నలుగురు మహిళలు నగలు కొనుగోలు కోసం వచ్చినట్లుగా నటించి చోరీకి పాల్పడ్డారు. యజమాని నగలు చూపిస్తున్న సమయంలో దాదాపు లక్షా యాభై వేల నగలు చోరీ చేశారు. యజమానికి అనుమానం వచ్చి వారిని నిలదీయగా వారు యజమానితో గొడవకు దిగి అక్కడి నుండి జారుకున్నారు. షాప్ లోని సీసీ ఫుటేజీ చూడగా నగలు చోరీ అయినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ నగల షాప్ కి వచ్చి పరిశీలించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళలు ఎటు వెళ్లారనే దానిపై దర్యాప్తు చేశారు. రైలు ఎక్కి వెళ్తున్నారనే సమాచారంతో జమ్మికుంట, కాజీపేట పోలీసులను అలర్ట్ చేశారు. కాజీపేటలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. సకాలంలో స్పందించి దొంగలను పట్టుకున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.