యూరియా కోసం ఎమ్మెల్యే ఆందోళన
Sirpur MLA Palvai Harishbabu:యూరియా కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెప్పులు, మరికొన్ని చోట్ల పాస్ పుస్తకాలు పెట్టుకుని మరీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల అయితే రాత్రుళ్లు సొసైటీ కార్యాలయాల ముందు నిద్రపోతున్నారు. రైతులకు సక్రమంగా యూరియా చేరడం లేదని ఆందోళనలు ధర్నాలు సైతం కొనసాగుతున్నాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా ఎమ్మెల్యేనే నిరసనకు దిగారు.
రైతులకు యూరియా సక్రమంగా సరఫరా జరగడం లేదని, వెంటనే వారికి యూరియా అందచేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ ముందు రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ. 266 దొరికే యూరియా బయట బ్లాక్ మార్కెట్‌లో రూ. 600 ఎలా దొరుకుతుందో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పాలన్నారు. ఈ సంవత్సరం కృత్రిమ కొరత సృష్టించి, ప్రభుత్వ అధికారులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు కూడబలుక్కుని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు. యూరియా కొరత ఉందని, యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం అయిందని దుయ్యబట్టారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు పంచుకుంటున్నారని దీంతో రైతులకు యూరియా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సక్రమంగా సరఫరా చేసేంత వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.