బహిరంగ చర్చకు సిద్ధమా..?
Mancherial MLA Prem Sagar Rao:అభివృద్ధి విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే తనపై కొందరు నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని ఘాటుగా విమర్శించారు. బతుకమ్మ కానుకగా మహిళలకు శ్రీ శక్తి భవనం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్ కు సరి సమానంగా నిలబెడతానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే లేనటువంటి 400 మెగావాట్ల సబ్ స్టేషన్ మంచిర్యాలలో, 220 మెగావాట్ల సబ్ స్టేషన్ లక్షెట్టిపేటలో, 130 మెగావాట్ల సబ్ స్టేషన్ నస్పూర్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయన్నారు.
మంచిర్యాల పట్టణంలో శిథిలావస్థలో ఉన్న బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మిస్తామన్నారు.మంచిర్యాల జిల్లాకు త్వరలోనే నవోదయ హై స్కూల్ మంజూరు అవుతుందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించి మున్సిపాలిటీ ద్వారా తాగునీరు, శానిటేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరారు..
రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 20 రోజు అనారోగ్యానికి గురయ్యాయని… తాను ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.