కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్

Heavy Rains in Telangana:రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎనిమిది గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షం పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. వర్షానికి ఎక్కడికి అక్కడ కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి.

కామారెడ్డిలోని బతుకమ్మ కుంట, రుక్మిణికుంట, గాంధీనగర్‌ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దోమకొండ, భిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. బిక్కనూర్ మండల శివారులోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలు స్తంభించాయి. కామారెడ్డి- సరంపల్లి హైదరాబాద్‌ రోడ్డు వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి శివారులో నిజామాబాద్- హైదరాబాద్ మార్గంలోని రైల్వే ట్రాక్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ దంచి కొడుతున్న వానాలతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయి అద్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్‌ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు. జిల్లాలోని ఆర్గొండ ప్రాంతంలో అత్యధికంగా 36.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బిక్కనూరులో 23.8, పాత రాజంపేటలో 21.5 సెంటీమీటర్ల వర్షం పడింది. మెదక్‌ జిల్లా నాగాపూర్‌లో 20.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది

Get real time updates directly on you device, subscribe now.

You might also like