ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమం..

MP Gaddam Vamsi Krishn: ప్రజల సంక్షేమానికి ప్రజా పాలన ద్వారా కృషి చేస్తున్న‌ట్లు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో వరద నీటి పరిస్థితి, మాతా శిశు ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ వరదల కారణంగా ప్రతి సంవత్సరం మాత శిశు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిసారి వారి సంక్షేమం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించడం బాధాకరమని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మాణం అవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి అయిన తర్వాత మాతా శిశు ఆసుపత్రిని తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నుండి వ‌స్తున్న గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలు నేపథ్యలో వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజల రక్షణ కోసం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ వంశీకృష్ణ జిల్లా కేంద్రంలో నిర్మాణం అవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పిడుగుపాటుకు గురై వైద్య సేవలు పొందుతున్న కోటపల్లి మండలానికి చెందిన రాజమల్లును పరామర్శించి బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. నస్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గడ్డం వెంకటస్వామి (కాకా) ట్రస్ట్ తరపున ఆసుపత్రికి కుర్చీలను అందజేశారు.

జైపూర్ మండలం కిష్టాపూర్, వేలాల గ్రామాలలో వరద నీటి కారణంగా ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. భారీ వర్షాలతో వరద నీటి కారణంగా నీట మునిగిన పంటల వివరాలు, సంబంధిత రైతుల వివరాలతో పూర్తి స్థాయి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. నివేదికలో అర్హులైన రైతుల వివరాలు మాత్రమే ఉండాలని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేలాల గ్రామ సమీపంలోని గోదావరి నది తీరాన్ని పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like