2.15 లక్షల టన్నుల ఉత్పత్తి
120 రోజులు.. లక్ష్యం 270 లక్షల టన్నులు - రోజుకు 14.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలి - ఏరియా జీఎంలతో సమీక్ష లో డైరెక్టర్ల
సింగరేణి కాలరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని డైరెక్టర్లు చంద్రశేఖర్ (ఆపరేషన్స్) బలరామ్ (ప్రాజెక్ట్స్అండ్ప్లానింగ్,ఫైనాన్స్,పర్సనల్)సత్యనారాయణరావు ఏరియా జీఎంలకు దిశా నిర్దేశం చేశారు.అడ్వైజర్(మైనింగ్) డి.ఎన్.ప్రసాద్,ఈడీ (కోల్ మూమెంట్) అల్విన్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్రపాండే,జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) సూర్యనారాయణ లతో కలిసి బుధవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ. ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేందుకు రానున్న 120 రోజులు కీలకమన్నారు. మిగిలిన 270 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. డిసెంబరులో రోజుకు 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని కోరారు. అలాగే 14.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని స్పష్టం చేశారు. సరాసరి రోజుకు 39 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరగాలని పేర్కొన్నారు.
కంపెనీ షావెల్స్ ద్వారా రోజుకు 2 లక్షల టన్నులు ఓవర్ బర్డెన్ తీయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఉపరితల గనులకు అవసరమైన ఓబీ కాంట్రాక్టులు, యంత్రాలు, రావాల్సిన అనుమతులు సమకూర్చినందున నిర్దేశిత లక్ష్యాలకు తగ్గకుండా ఉత్పత్తి సాధించాలన్నారు. యంత్రాలను ఎప్పటికప్పుడు మెయింటెన్స్ చేయించడం ద్వారా ఉత్పత్తికి విఘాతం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
భద్రత చర్యలు పాటిస్తూ ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ఇటీవల అన్ని యూనియన్లతో గనుల్లో భద్రత చర్యలపై సమావేశం నిర్వహించామని, మున్ముందు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు స్వీకరిస్తూ వాటిని అమలు చేస్తామన్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) అల్విన్ మాట్లాడుతూ.. బొగ్గు నాణ్యతపైనా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జీఎం(సీడీఎన్, మార్కెటింగ్) సూర్యనారాయణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్ లో బొగ్గు ధరలు తగ్గు తున్నందున పోటీ మార్కెట్లో తట్టుకునేందుకు వీలుగా నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. నిర్దేశిత గ్రేడ్ బొగ్గు సరఫరా జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు వెంటనే ఓవర్ బర్డెన్ ను తొలగించే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మొదటి 8 నెలల్లో రవాణా లో 60 శాతం, ఉత్పత్తిలో 52 శాతం, ఓబీ తొలగింపులో 26 శాతం వృద్ధి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో నవంబరు నెలతో ముగిసిన తొలి 8 నెలల కాలంలో మంచి వృద్ధిని నమోదు చేసిందని డైరెక్టర్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21) లో ఇదే కాలానికి జరిగిన బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుతో పోల్చితే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం లో బొగ్గు రవాణా లో 60 శాతం, ఉత్పత్తిలో 52 శాతం, ఓబీ తొలగింపులో 26 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడిరచారు.
గత ఆర్థిక సంవత్సరంలో నవంబరు మాసం ముగిసే నాటికి 26.935 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించగా.. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 40.86 మిలియన్ టన్నులు సాధించడం ద్వారా ఉత్పత్తి లో 52 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు.
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42.462 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం సాధించిన 26.517 మిలియన్ టన్నుల మీద 60 శాతం వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. గతేడాది మొదటి 8 ఎనిమిది నెలల కాలంలో 187.6 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించగా.. ప్రస్తుతం 26 శాతం వృద్ధి తో 236.44 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించినట్లు తెలిపారు.
ఇదే ఉత్సాహంతో మిగిలిన నాలుగు నెలల కాలంలోనూ పనిచేసి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని డైరెక్టర్లు ఈ సందర్భంగా ఏరియా జీఎంలను కోరారు.
సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జీఎం(సీపీపీ) నాగభూషణ్ రెడ్డి, జీఎం(పీపీ) పి.సత్తయ్య, జీఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, జీఎం(ఎంపీ) రమేశ్ రావు, అన్ని ఏరియాల నుంచి జీఎంలు, కార్పోరేట్ జీఎంలు పాల్గొన్నారు.