గురు శిష్యుల ప‌య‌న‌మెటు…?

Koneru Konappa, Allola Indrakaran Reddy:అధికారం పోగానే అన్ని ఇచ్చిన పార్టీకి హ్యాండిచ్చారు… అలా బీఆర్ఎస్ గ‌ద్దె దిగిందో లేదో.. ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా అర్రులు చాచారు. ఆరు నెల‌లు గడిచాయో…? లేదో..? కారు దిగేసి కండువా మార్చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. అక్క‌డ వీళ్ల ఆట‌లు సాగ‌క‌.. ఆగ‌మ‌య్యారు. ఉండాలా…? వెళ్లాలా..? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏజ్ బార్ అయినా అధికార దాహం తీర‌లేదా..? వాళ్ల ఆరాటం.. పోరాటం.. ప్ర‌యార్టిటీ… ప‌ద‌వుల కోస‌మా..? లేదా ప్ర‌జ‌ల కోస‌మా…? నాంది న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం…

ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో నేత‌లంద‌రిదీ ఓ దారి అయితే, ఆ ఇద్ద‌రు నేత‌లది మ‌రో దారి. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వాళ్లు ఏ పార్టీలో వారి క్యాడ‌ర్‌కే తెలియ‌ని ప‌రిస్థితి. ఎక్క‌డ అధికారం ఉంటే అక్క‌డికే వెళ్తార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు. కాలం మారే కొద్దీ పార్టీలు మారినా వాళ్ల‌లో కొంత మార్పు క‌నిపించినా చివ‌ర‌కు ఆ నేత‌ల్లో నైరాశ్య‌మే ఆవ‌హించింది. ఒక నేత ఇప్ప‌టికే చేరిన పార్టీకి రాం రాం చెప్పేయ‌గా.. మ‌రో నేత గోడ దూకేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో ఒక‌రు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప కాగా… మ‌రొక‌రు మాజీ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.

1980ల ప్రారంభం నుండి క్రియాశీల రాజకీయాలలో ఉన్న ఆయ‌న 1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అనంత‌రం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ప‌నిచేశారు. 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంత‌రం బీఆర్ఎస్ చేరి మంత్రి అయ్యారు. 2018లో సైతం బీఆర్ఎస్ నుంచి గెలిచి రెండో సారి మంత్రిగా ప‌నిచేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మే 01న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే, ఆయ‌న‌కు పార్టీ ప‌రంగా ఎలాంటి ప‌ద‌వులు కానీ, ప్రాధాన్య‌త కానీ ద‌క్క‌డం లేదు. గుంపులో గోవింద‌య్య లాగా అలాగే ఉండిపోవ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌డం లేదు. ఆయ‌న పార్టీలో ఇమ‌డం లేద‌ని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వ‌ర్గీయులే చెబుతున్నారు.

తాజాగా వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఆయ‌న చేసిన హ‌డావిడి సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ‌కెక్కింది. రెండు రోజుల కింద‌ట ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సైతం ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి పార్టీ త‌న‌ను వాడుకోవ‌డం లేదంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌ను గుర్తించ‌డం లేద‌ని చెప్ప‌డం వెన‌క ఉన్న మ‌త‌ల‌బు ఏంట‌నే దానిపై పార్టీ శ్రేణులు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల వెన‌క పార్టీకి సేవ చేయాల‌నే ఆరాటమా..? ప‌ద‌వులు పొందాల‌నే పోరాటమా..? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ గురువు ప‌రిస్థితి ఇలా ఉంటే, ఇక శిష్యుడు కోన‌ప్ప సైతం కాంగ్రెస్ పార్టీపై ఆగ్ర‌హంతో ఉన్నారు..

కోనేరు కోన‌ప్ప కొద్ది రోజుల కింద‌టే కాంగ్రెస్ పార్టీతో తెగ‌దెంపులు చేసుకున్నారు. ఆయ‌న సైతం బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డితో క‌లిసి బీఎస్పీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్ గూటికి చేరారు. పార్టీకి ఆయ‌న‌కు మంచి గుర్తింపునిచ్చింది. తిరిగి ఎమ్మెల్యేగా సైతం పోటీ చేసి గెలిచారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి కావాల్సిన నిధులు తెచ్చుకున్నారు. అప్ప‌టి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కోనేరు కోన‌ప్ప గెలుపు కోసం సిర్పూరులో పేప‌ర్ ప‌రిశ్ర‌మ‌ను తిరిగి తెరిపించారంటే ఆయ‌న‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త అర్దం అవుతుంది. అయితే, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఓడిపోవ‌డం, కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో ఆర్ ఎస్ ప్ర‌వీణ్ రాక‌ను సాకుగా చూపుతూ కాంగ్రెస్ గూటికి చేరారు కోనేరు కోన‌ప్ప‌.

ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు… తాను కొట్లాడి అనుమ‌తులు తీసుకువ‌చ్చిన ప‌నులు కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిపివేయ‌డంతో ఆయ‌న సొంత పార్టీ పైనే బాణాలు ఎక్కుపెట్టారు. ఆ త‌ర్వాత ఒంట‌రిగా బ‌రిలో ఉంటాన‌ని, కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నానంటూ కోనేరు చెప్పుకొచ్చారు. అయితే, ఆయ‌న మాట్లాడే స‌మ‌యంలో కేసీఆర్ దేవుడంటూ.. కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించ‌డంతో ఆయ‌న ఖ‌చ్చితంగా బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. కోన‌ప్ప బీఆర్ ఎస్ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు కూడా స్థానిక బీఆర్ఎస్ నేత‌లు అనుమాన‌లు వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత క‌ష్ట‌కాలంలో పార్టీని వ‌దిలిపెట్టిన ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకోవ‌ద్ద‌ని ప‌లువురు అధిష్టానం దృష్టికి తీసుకుపోయిన‌ట్లు స‌మాచారం.

అయితే, ఇక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను అచ్చంపేట‌కు కానీ, బెల్లంప‌ల్లికి కానీ పంపించి కోనేరు కోన‌ప్ప‌కు ఇక్క‌డ టిక్కట్టు ఇచ్చేలా అధిష్టానం ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, స్థానిక నేత‌లు ఏం చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌ల‌మైన నేత లేక‌పోవ‌డం కోనేరు కోన‌ప్ప‌కు క‌లిసివ‌చ్చే అంశంగా మార‌నుంది. అదే స‌మ‌యంలో అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని తిరిగి బీఆర్ఎస్ లోకి తీసుకుంటారా..? లేదా..? అనేది ప్ర‌శ్నార్థ‌కం. ఆయ‌న కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డానికే నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చంది. మ‌రి ఇప్పుడు ఆయ‌న‌ను బీఆర్ఎస్‌లోకి తీసుకుంటామంటే స్థానిక నేత‌లు ఖ‌చ్చితంగా అడ్డు చెప్పే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ బీఆర్ఎస్ అధిష్టానం ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోతే ఏం చేస్తార‌నేది చూడాలి మ‌రి…

Get real time updates directly on you device, subscribe now.

You might also like