వివేక్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు..
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
Balka Suman:చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వివేక్ ఈ నియోజకవర్గానికి ఎన్నో చేస్తానని హామీ ఇచ్చాడని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్యబట్టారు. మంగళవారం చెన్నూర్‌లో ‘అప్పుడే మంచి గుండే` కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ “గడ్డం వివేక్ ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలో 40 వేల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు… ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించాడా?… ఆయన ఇంట్లో మాత్రం మూడు నౌకర్లు వచ్చాయి.. గోదావరి, ప్రాణహిత నదుల నుంచి వరద రాకుండా కరకట్టలు కడుతానని చెప్పాడని, ఇప్పటి వరకు ఎందుకు కట్టలేదని మంత్రి వివేక్ ను ప్రశ్నించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక దందా అంటూ గగ్గోలు పెట్టారని, మరి ఇప్పుడు నియోజకవర్గంలో ఇసుక వ్యాపారం ఎందుకు నడుస్తున్నదో…? చెప్పాల”ని ప్రశ్నించారు. నియోకవర్గంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ప్రభుత్వంతోనైనా ఇప్పించాలని, లేదంటే నీ దగ్గర ఉన్న వేల కోట్ల నుంచి అయినా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి తప్ప.. నియోజకవర్గానికి మంత్రి వివేక్ చేసిందేమీ లేదన్నారు. గతంలో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యాక్ వాటర్‌తో పంట నీట మునిగిందన్న మంత్రి వివేక్ ఇప్పుడు బ్యారేజీ గేట్లు ఎత్తి ఉన్నప్పటికీ పంటలు నీటిలో మునిగి రైతులు నష్టపోయారని దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఎన్నికల హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువెళ్లేందుకే అప్పుడే మంచిగుండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రూ. 2 లక్షల రుణ మాఫీ అయ్యిందా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయా? రైతు భరోసా ద్వారా రూ.15 వేలు వస్తున్నాయా..? కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ.2,500 వస్తున్నాయా? పింఛన్ రూ. 4 వేలకు పెరిగిందా అంటూ అక్కడున్న వారిని ప్రశ్నించగా.. రాలేదంటూ వారు సమాధానాలు ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కారులో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బంది పడ లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై నిత్యం రోడ్డెక్కుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పెట్రోల్ పంపు నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారుల మీదుగా శ్రేణులతో కలసి ర్యాలీ తీశారు. అస్నాద్ చౌరస్తా వద్ద తెలం గాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు రాజారమేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మ ల్లెల దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జడ్పీటీసీ మోతి తిరుపతి, రేవెల్లి మహేశ్, జగన్నాథుల శ్రీనివాస్, సుధాకర్, అనిల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.