గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు
నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర
Ramagundam Police Commissioner Amber Kishore Jha గణేష్ నిమజ్జనానికి పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత, బందోబస్త్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గురువారం మంచిర్యాల, తాండూర్ పెద్ద చెరువు వద్ద నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్, పెద్దపల్లి జోన్ పరిధిలో గోదావరి బ్రిడ్జ్ వద్ద నిమజ్జనం పాయింట్ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మంచిర్యాల జోన్ పరిధిలో వినాయక నిమజ్జనం, శోభయాత్ర బందోబస్తు గురించి పెద్దఎత్తున పోలీసులతో పాటు NSS, NCC, సింగరేణి ఎస్అండ్పీసీ సిబ్బంది 100 మందితో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలో 2,334 పెద్దపల్లి జోన్ పరిధిలో 2,524 మొత్తం 4858 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ విగ్రహాలను కమీషనరేట్ పరిధిలో 47 నిమజ్జన ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారని వెల్లడించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్ల అందుబాటులో ఉంటారన్నారు. నిమజ్జన శోభాయాత్ర డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.
గణేష్ ఉత్సవ కమిటీలు త్వరిత గతిన పూజలు ముగించి వెలుతురు ఉండగానే తమ విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. చిన్న పిల్లలు మహిళలు శోభ యాత్ర లో పాల్గొంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే ట్రాక్టర్ల, లారీలపై, ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.