బాహుబలి బాలుడు
5.2 kg Baby Boy Born: ఓ శిశువు ఏకంగా 5.2 కిలోల బరువుతో పుట్టి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు. వాస్తవానికి అప్పుడే పుట్టిన పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. అయితే, ఈ బాహుబలి బుడ్డోడు ఏకంగా 5.2 కిలోల రికార్డు బరువుతో జన్మించాడు. బాబు, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లో రాణి దుర్గావతి ఎల్గిన్ ఆసుపత్రిలో జన్మించాడు.
ఆనంది చౌక్సే అనే వ్యక్తి తన భార్య శుభాంగి చౌక్సేను ప్రసవం కోసం తీసుకువచ్చాడు. ప్రసవానికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసి వైద్యులు డెలివరీ చేశారు. ఇంత బరువున్న శిశువు జన్మించడం చూసి వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణ బరువు కంటే రెట్టింపు బరువుతో శిశువు జన్మించడం చాలా అరుదు. తల్లికి గర్భధారణ సమయంలో మధుమేహం లేదా ఇతర సమస్యలు ఉంటే ఇలా జరగవచ్చు. కానీ ఈ కేసులో తల్లి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉంది. మేము తల్లి, శిశువు ఇద్దరికీ పూర్తి పరీక్షలు నిర్వహించాం. ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
ప్రసవం చేసిన డాక్టర్ భావనా మిశ్రా మాట్లాడుతూ.. వాస్తవానికి పుట్టే శిశువు మూడు కిలోల కంటే ఎక్కువ ఉంటే ప్రసవం సవాలుగా మారుతుందన్నారు. కానీ, ఇక్కడ బాలుడు ఐదు కిలోల కంటే ఎక్కువగా ఉన్నాడని తెలిపారు. ఇది చాలా అరుదైన ఘటనగా చెప్పారామే. వేల ప్రసవాల్లో ఒకటి, రెండు ఇలా జరుగుతాయని చెప్పారు. కుటుంబ సభ్యులు సైతం బాలుడి పుట్టుకను అద్భుతంగా భావిస్తున్నారు. శి శిశువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ పసికందును “బాల గణేశుడు”గా అభివర్ణించారు. “సాక్షాత్తు మా ఇంట్లో గణనాథుడే జన్మించాడ”ని వారు సంతోషం వ్యక్తం చేశారు.
అయితే, అధిక బరువు గల శిశువుకు భవిష్యత్తులో ఊబకాయం లేదా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. అందువల్ల తల్లిదండ్రులు శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.